ములుగు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
మేడారం మహాజాతరకు వెళ్లే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన అవకాశం కల్పించింది. జాతర రద్దీని తప్పించుకుని అమ్మవార్లను సులభంగా దర్శించుకునేలా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హెలికాప్టర్ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ సేవలు ఈ నెల 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి.
మేడారం పరిసరాలను ఆకాశం నుంచి వీక్షించాలనుకునే భక్తుల కోసం ‘జాయ్ రైడ్స్’ ఏర్పాటు చేశారు. మేడారం సమీపంలోని పడిగాపూర్ హెలిప్యాడ్ నుంచి ఈ రైడ్ ప్రారంభమవుతుంది. సుమారు 6 నుంచి 7 నిమిషాల పాటు సాగే ఈ విహంగ వీక్షణానికి ఒక్కో వ్యక్తికి రూ. 4,800గా ఛార్జీ నిర్ణయించారు.
అలాగే హన్మకొండ నుంచి నేరుగా మేడారం వెళ్లాలనుకునే భక్తుల కోసం ప్రత్యేక హెలికాప్టర్ సర్వీసులు ఉన్నాయి. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్స్ నుంచి మేడారం వరకు రానుపోను ప్రయాణానికి ఒక్కొక్కరికి రూ. 35,999 ఛార్జీ వసూలు చేస్తారు. ఈ సేవలు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.
ఈ హెలికాప్టర్ సేవల ద్వారా భక్తులు ప్రయాణ సమయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు, జాతర వైభవాన్ని ఆకాశం నుంచి వీక్షించే ప్రత్యేక అనుభూతిని పొందవచ్చు.

إرسال تعليق