EB NEWS/పినపాక:
పినపాక మండలంలో ఆదివారం భారీ వర్షం కురుస్తోంది. గత కొంతకాలంగా వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ వర్షం ఎంతో ఊరటనిస్తోంది. వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోయే దశకు చేరుకున్న సమయంలో వర్షం కురుస్తుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
మండలంలోని పలు ప్రాంతాల్లో వర్షం ఏకధాటిగా కురుస్తుండటంతో పొలాలకు అవసరమైన తేమ అందుతోంది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు పంటలు ఎండిపోతుండటంతో ఇంజన్ల సాయంతో చెరువులు, ఇతర నీటి వనరుల నుంచి పొలాలకు నీటిని అందిస్తున్నారు. ఇలాంటి సమయంలో కురుస్తున్న వర్షం తమ పంటలకు ఎంతో ఉపయోగపడుతుందని రైతులు చెబుతున్నారు.
ఇదే విధంగా మరికొన్ని రోజులు వర్షాలు కురిసి పంటలకు పూర్తిస్థాయిలో మేలు జరగాలని రైతన్నలు ఆకాంక్షిస్తున్నారు. వర్షాలు కొనసాగితే పంటలు కాపాడుకోవడంతో పాటు సాగు పనులకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

