23 మంది అరెస్ట్.. మిగతా నిందితులను త్వరలో పట్టుకుంటాం: డీఎస్పీ రవీందర్ రెడ్డి
EB NEWS/మణుగూరు:
ఈ నెల 27న మణుగూరులో జరిగిన శివ హత్య కేసుకు సంబంధించి డీఎస్పీ రవీందర్ రెడ్డి కీలక వివరాలను వెల్లడించారు. ఏడాది క్రితం జరిగిన ఓ ఫోన్ గొడవ కారణంగా శివను టార్గెట్ చేసి, చివరకు 27 మంది కలిసి దాడి చేయడంతో హత్య జరిగినట్లు తెలిపారు.
డీఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతుడు శివ వద్ద పనిచేసే సతీష్‌కు, మణుగూరు గాంధీ బొమ్మ సెంటర్‌కు చెందిన లోకేష్‌కు ఏడాది క్రితం గొడవ జరిగింది. సతీష్‌కు ఫోన్ చేసిన లోకేష్ తన చెల్లి గురించి తప్పుగా మాట్లాడినట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న శివ.. సతీష్ వద్ద ఉన్న ఫోన్ తీసుకుని లోకేష్‌తో మాట్లాడినట్లు చెప్పారు. తాను వచ్చిన తర్వాత మాట్లాడుకుందామని, గొడవలు ఎందుకని శివ ఫోన్‌లో లోకేష్‌కు చెప్పినట్లు వెల్లడించారు.
ఈ వ్యవహారంలో హైదరాబాద్ లో ఉన్న శివ జోక్యం చేసుకుని ఫోన్‌లో మాట్లాడిన విషయాన్ని లోకేష్.. మణుగూరులో ఏంకే టీం ను నడిపిస్తున్న వ్యక్తులకు తెలియజేసినట్లు డీఎస్పీ తెలిపారు. అనంతరం ఆ టీమ్‌లోని కొందరు శివను టార్గెట్ చేసినట్లు చెప్పారు. ఒకరి తర్వాత ఒకరు శివకు ఫోన్ చేసి అసభ్యకరంగా, రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని పేర్కొన్నారు.
**“నువ్వు మణుగూరుకు రా.. చూసుకుందాం”** అంటూ శివను రెచ్చగొట్టినట్లు తెలిపారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా శివ మణుగూరుకు వచ్చిన విషయం టీమ్ సభ్యులకు తెలియడంతో మరోసారి ఫోన్ చేసి **“చేతకాదా.. మగాడివి కాదా?”** అంటూ సవాల్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.
అంతటితో ఆగకుండా **రాజుపేట గ్రౌండ్‌కు రావాలని, అక్కడ మాట్లాడుకుందామని** టీమ్ సభ్యులు శివను రెచ్చగొట్టినట్లు తెలిపారు. దీంతో శివ తన స్నేహితుడిని వెంట తీసుకుని మాట్లాడేందుకు రాజుపేట గ్రౌండ్‌కు వెళ్లినట్లు చెప్పారు.
శివ గ్రౌండ్‌కు చేరుకున్న సమయంలో ఎంకే టీమ్‌కు చెందిన **27 మంది కలిసి విచక్షణారహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు** డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు.
ఈ కేసులో మొత్తం 27 మంది నిందితుల్లో **23 మందిని పట్టుకున్నామని**, మిగిలిన నిందితులను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని డీఎస్పీ వెల్లడించారు.
యువత తప్పుదారి పట్టొద్దు
ఈ టీమ్ గంజాయి వ్యాపారం చేయడం కానీ, గంజాయి సేవించడం కానీ చేసినట్లు తమ దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదని డీఎస్పీ తెలిపారు. మణుగూరు పట్టణంలో ఎవరైనా టీమ్‌లుగా ఏర్పడి తప్పుదోవలో వ్యవహరిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు.
యువత అనవసరమైన గొడవలు, చెడు మార్గాలకు వెళ్లి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని డీఎస్పీ రవీందర్ రెడ్డి సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సమావేశంలో సీఐ పాటి నాగబాబు, ఎస్‌ఐలు నగేష్, రవూఫ్ పాల్గొన్నారు.

