EB NEWS/కరకగూడెం:
మండల పరిధిలోని అశ్వాపురం పాడు ప్రాంతంలో ఓ వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు ఆయుధాలతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం.. వలస గిరిజనుడైన వజ్జా భీమరాజుపై గుర్తుతెలియని వ్యక్తులు తలపై తీవ్రంగా దాడి చేసినట్లు సమాచారం.
ఈ దాడిలో భీమరాజుకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా మారినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే అతడిని మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనకు గల కారణాలు, దాడికి పాల్పడిన వ్యక్తుల వివరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

