ప్లాంట్‌లోకి అనుమతి ఇవ్వలేదని నేతల ఆరోపణ.. విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు సరఫరాపై ప్రశ్నలు
EB NEWS/మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (బీటీపీఎస్) వద్ద బీఆర్ఎస్ నాయకులు గురువారం నిరసన చేపట్టారు. ప్లాంట్ సందర్శనకు వెళ్లిన తమ బృందాన్ని లోపలికి అనుమతించలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. దీంతో పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సహా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్లాంట్ ప్రధాన గేటు ఎదుట బైఠాయించారు. విద్యుత్ ఉత్పత్తి పరిస్థితులు, యూనిట్ల పనితీరు, బొగ్గు సరఫరా అంశాలను పరిశీలించేందుకు తాము వచ్చినట్లు వారు తెలిపారు.
రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. జెన్‌కో ప్లాంట్లలో కొన్ని యూనిట్లు నిలిచిపోవడం, బొగ్గు సరఫరా పరిస్థితులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. సింగరేణిలో బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ జెన్‌కో ప్లాంట్లకు నాణ్యమైన బొగ్గు సరఫరా ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు.
నాణ్యమైన బొగ్గును ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ప్రస్తుత విద్యుత్ ఉత్పత్తి పరిస్థితులపై విద్యుత్ శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.
జెన్‌కో ప్లాంట్లకు నాణ్యమైన బొగ్గు సరఫరా చేసి విద్యుత్ ఉత్పత్తిని పూర్తి సామర్థ్యానికి తీసుకురావాలని కోరారు. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
బీఆర్ఎస్ నిరసన నేపథ్యంలో బీటీపీఎస్ ప్రధాన గేటు, పరిసర ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంతో బీఆర్ఎస్ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు

