EB NEWS/జూలూరుపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెంలో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన హరిణి (18) ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. సెలవుల నేపథ్యంలో ఇటీవల స్వగ్రామానికి వచ్చింది.
ఇంటి ఆవరణలోని బాత్రూమ్ వెనుక ఒంటిపై గాయాలతో హరిణి మృతదేహం కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై హరిణి తల్లి రాజేశ్వరి తీవ్ర ఆరోపణలు చేశారు. పక్కింటికి చెందిన వ్యక్తి తన కుమార్తెపై దారుణానికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

