విజయవాడ, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ప్రొద్దుటూరులో తల్లి ప్రాణం తీసిన కుమారుడు
విజయవాడలో పిన్ని శరీరాన్ని ముక్కలుగా చేసి హత్య - కాల్వల్లో శరీరభాగాలు
తల్లి తన బిడ్డను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. అదే విధంగా పిన్ని తన పిల్లలుగా చూసుకుంటుంది. కానీ, ఇటీవలి రోజుల్లో మన సమాజంలో ఆ బంధాల విలువ తరిగిపోతోంది. ప్రేమ, దయ, కరుణ అనే మానవీయ విలువలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. కడపలో కుమారుడి చేతిలో తల్లి హత్య, విజయవాడలో పిన్నిని దారుణంగా హత్య చేసిన ఘటనలు మానవత్వం కనుమరుగైందా అనిపించేలా ఉన్నాయి.
కుమారుడే ప్రాణం తీశాడు: కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం శ్రీరామ్ నగర్‌లో దారుణ ఘటన జరిగింది. లక్ష్మీదేవి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. జీవితమంతా విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేసిన ఆమె, తన కుమారుడు యశ్వంత్ రెడ్డిని బీటెక్ చదివించి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నారు. కానీ ఆమె ఆ బిడ్డ చేతిలోనే మరణించారు.
యశ్వంత్ కుమార్ రెడ్డి మూడేళ్ల కిత్రం చెన్నైలో బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణ కోసం హైదారాబాదుకు వెళ్లి అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఖర్చుల కోసం ప్రతి నెలా తల్లి డబ్బులు పంపించేవారు. ఇటీవల తల్లికి ఫోన్ చేసిన యశ్వంత్‌కుమార్ రెడ్డి రూ.3 వేలు డబ్బులు అడ్డగా పంపించారు. మరోసారి రూ.10 వేలు కావాలని పట్టుపట్టాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో తల్లిపై కోపం పెంచుకున్న యశ్వంత్, కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఉన్నట్టుండి ఆదివారం ఉదయం హైదరాబాదు నుంచి ప్రొద్దుటూరులోని ఇంటికి చేరుకున్నాడు.
వచ్చిరాగానే తల్లితో గొడవకు దిగి దాడి చేశారు. ఆమె గట్టిగా అరవడంతో బెడ్‌రూంలో ఉన్న తండ్రి విజయభాస్కర్‌రెడ్డి బయటకు వచ్చే ప్రయత్నం చేయగా అతన్ని గదిలోకి తోసేసి బయట గడియపెట్టాడు. ఆపై కూరగాయల కత్తితో ఆమె గొంతు కోశాడు. ఆ రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న లక్ష్మిదేవిని ఈడ్చుకుంటూ వచ్చి బయటపడేశాడు. ఆపై తలుపు వేసుకుని ఇంట్లో దర్జాగా టీవీ చూస్తూ కూర్చున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తలుపు బలంగా నెట్టి లోనికి వెళ్లారు. యువకుడిని అదపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శవపరీక్షల కోసం మృతదేహాన్ని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు.
విజయవాడలో పిన్ని హత్య - మానవతకు మచ్చ: మరోవైపు విజయవాడలో మరింత దారుణం జరిగింది. పిన్ని వరస అయ్యే వృద్ధురాలిని హత్య చేసి శరీర భాగాలను ముక్కలుగా చేసి మురుగు కాల్వల్లో పడేశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఆస్తి తగాదా లేదా కుటుంబ వివాదమా అని అనుమానిస్తున్నారు. మృతురాలి తల, చేతులు, మొండెం వేర్వేరు ప్రాంతాల్లో దొరకగా, కాళ్లు ఇంకా కనబడలేదు.
ఒకప్పుడు కుటుంబంలో ప్రేమ, పరస్పర గౌరవం ఉండేది. ఇప్పుడు ఆస్తి కోసం బంధాలు తెగిపోతున్నాయి. రక్తసంబంధాలే రక్తపాతం సృష్టిస్తున్నాయి. వృద్ధురాలి అక్క కుమారుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. తన భార్యతో గొడవకు వృద్ధురాలే కారణమని కక్ష పెంచుకుని ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు
కుటుంబ వ్యవస్థలో చీలికలు: మన సమాజంలో కుటుంబం అనేది ఒక ప్రేమ గూడు లాంటిది. కానీ, ఇప్పుడు ఆ గూటిని కోపం, ఆర్థిక ఒత్తిడి, ఒంటరితనం వెంటాడుతున్నాయి. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం శ్రమిస్తుంటే, కొందరు యువతీ యువకులు మానసికంగా బలహీనంగా మారుతున్నారు. మన దేశంలో మానసిక ఆరోగ్యంపై అవగాహన తక్కువ అనే చెప్పాలి. ప్రొద్దుటూరులో యశ్వంత్ రెడ్డి ఘటన దీనికి ఉదాహరణ. సరైన కౌన్సిలింగ్, మానసిక చికిత్స లభించి ఉంటే లక్ష్మీదేవి బతికి ఉండేవారేమో!
మనసుల మధ్య గోడలు పెరుగుతున్నాయా?: ప్రస్తుతం సమాజంలో ప్రేమ స్థానంలో ఆస్తి, పగ, అనుమానం చోటు దక్కించుకుంటున్నాయి. విజయవాడ ఘటనలో పిన్నిని హత్య చేసి ముక్కలు చేయడం, ఇది కేవలం నేరం మాత్రమే కాదు, మానవతకు మచ్చ. ఇప్పుడు మన సమాజానికి మానసిక ఆరోగ్య అవగాహన, కుటుంబంలో ఆరోగ్యకరమైన సంభాషణలు, సమాజంలో ప్రేమ దయ అవసరం.
న్యాయ వ్యవస్థ మాత్రమే కాదు, మనసులు మారాలి: ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, నిందితులకు శిక్ష పడుతుంది. కానీ మనసుల్లోని మృగాన్ని ఎవరు శిక్షిస్తారు? మానవ సంబంధాలు దెబ్బతినకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి ప్రశ్నించుకోవాలి. ప్రేమ, సహనం, సంభాషణలే సమాజంలో మార్పు తీసుకురాగలవు. ఒకవేళ అవి కోల్పోతే, మనిషి మానవత్వం మంటకలిసిపోతుంది.

