భద్రాచలం:గుర్తు తెలియని శవాలు

 

భద్రాచలం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


(క్రైమ్ స్టోరీ) 


భద్రాచలం పుణ్య క్షేత్రం, గోదావరి నది ఒడ్డున ప్రశాంతంగా ఉంది. దేశం లోని వివిధ ప్రాంతాల నుండీ వచ్చిన భక్తులతో పాటు, హైదరాబాద్ నుండి వచ్చిన విజయ్, కోమలి దంపతులు గోదావరిలో స్నాన ఘట్టాల వద్ద పుణ్య స్నానాలు చేస్తున్నారు. వారి పిల్లలు, అక్కా తమ్ముడు అయిన శరణ్య, ప్రణయ్ నది ఒడ్డున ఇసుకలో పిచ్చుక గూళ్లు కడుతూ సరదాగా ఆడుకుంటున్నారు.

అంతా ప్రశాంతంగా ఉన్న ఈ సమయంలో, ఒక్కసారిగా శరణ్య గట్టిగా "మమ్మీ.. డాడీ!" అని గట్టిగా కేకలు వేసింది. నదిలో స్నానం చేస్తున్న విజయ్ ఒక్క పరుగున తన పిల్లలని చేరుకున్నాడు. పిల్లలు తండ్రి ని చుట్టుకొని భయంతో బావురుమన్నారు.ఏమి జరిగిందా అని విజయ్ అటువైపు చూసాడు. పిల్లలు అప్పటివరకు ఆడుకున్న ఇసుకలోనుండి ఒక మనిషి చేయి పైకి లేచి ఉంది. ఆ దృశ్యం చూసి అక్కడున్న భక్తులందరూ భయంతో ఉలిక్కిపడి, ఆ స్థలంలో గుమిగూడారు. కొద్దిసేపటికే ఎవరో డయల్ 100కి ఫోన్ చేసి గోదావరి నది ఒడ్డున శవం ఉందని పోలీస్ కి సమాచారం అందించారు.

          ***

సమాచారం అందుకున్న వెంటనే, ఇన్స్పెక్టర్ ఎం.అబ్బయ్య తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గోదావరి ఒడ్డున గుమిగూడిన జనాలను పక్కకు నెట్టి, శవం ఉన్న ప్రదేశానికి వెళ్లారు. గ్రామ పంచాయతీ సిబ్బంది తో శవాన్ని బయటకు తీసారు. ఇసుకలో కూరుకుపోయి ఉన్న ఆ శవం ఒక గుర్తు తెలియని మగ వ్యక్తిది. ప్రాథమిక పరిశీలనలో, మృతదేహంపై ఎలాంటి దుస్తులు లేకపోవడం ఇన్స్పెక్టర్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. శవం పై ఎటువంటి బాహ్య గాయాలు లేవు.

ఇన్స్పెక్టర్ అబ్బయ్య వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఎవరు శవం దగ్గరికి రాకుండా చుట్టూ రౌండ్ గా టేప్ వేసారు. ఇన్స్పెక్టర్ ఫోటోగ్రాఫర్ ని పిలిపించి ఆ మృత దేహాన్ని వివిధ కోణాలలో ఫోటోలు తీయించాడు. గోదావరిలో స్నానం చేసిన భక్తులను, ఆ చుట్టుపక్కల వారిని విచారించారు. అయితే, ఎవరికీ ఆ శవం గురించి కానీ, ఆ వ్యక్తి గురించి కానీ ఎలాంటి సమాచారం తెలియదు. శరణ్య, ప్రణయ్ లను అడిగినా, వారు కేవలం ఆడుకుంటూ ఇసుకను తవ్వుతుండగా ఆ చేయి కనిపించిందని మాత్రమే చెప్పారు.

పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం నివేదిక ఎంత త్వరగా వస్తుందా అని ఇన్స్పెక్టర్ అబ్బయ్య వేచి ఉన్నారు. సమీప పోలీస్ స్టేషన్లలో ఏవైనా మ్యాన్ మిస్సింగ్ కేసులు ఏమైనా రిజిస్టర్ అయినవేమో ఎంక్వయిరీ చేయమని ఇన్స్పెక్టర్ అబ్బయ్య హెడ్ కానిస్టేబుల్ ఆవుల సూర్యంని ఆదేశించాడు.

రెండు రోజుల తర్వాత పోస్ట్ మార్టం నివేదిక ఇన్స్పెక్టర్ అబ్బయ్య చేతికి అందింది. నివేదికలోని వివరాలు చూసి ఆయన ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందారు. ఆ శవం కొన్ని రోజుల క్రితమే పాతిపెట్టబడిందని, మరణానికి కారణం విషప్రయోగం అని నివేదిక స్పష్టం చేసింది. అంతేకాదు, మృతదేహంలోని అంతర్గత అవయవాలు చాలావరకు తీసివేయబడ్డాయని ఆ నివేదికలో ఉంది.

ఇది ఒక సాధారణ మరణం కాదని, అత్యంత క్రూరమైన హత్య అని ఇన్స్పెక్టర్ అబ్బయ్యకు అర్థమైంది. అవయవాల అక్రమ రవాణా కోణంలో దర్యాప్తును ప్రారంభించారు. ఈ కేసులో మరింత లోతుగా వెళ్ళినప్పుడు, ఇన్స్పెక్టర్ అబ్బయ్యకి ఒక భయంకరమైన నెట్‌వర్క్ గురించి తెలిసింది. 

          ***

ఈ నెట్‌వర్క్ గోదావరి పరిసర ప్రాంతాల్లోని నిరుపేదలను, అమాయక గిరిజనులను లక్ష్యంగా చేసుకుని, వారికి డబ్బు ఆశ చూపించి వారి అవయవాలను అక్రమంగా విక్రయిస్తోంది. ఆ మృతదేహం కూడా ఈ నెట్‌వర్క్ బారిన పడిన ఒక బాధితుడిదే.

ఇన్స్పెక్టర్ అబ్బయ్య, ఈ భయంకరమైన నిజం తెలుసుకుని, ఈ నెట్‌వర్క్‌ను పట్టుకోవడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. శవం ఫోటో అన్ని దిన పత్రికలలో, టెలివిజన్ లో అన్ని లోకల్ న్యూస్ ఛానెల్స్ లో ప్రకటన ఇవ్వడం జరిగింది. గోదావరి తీరంలో బయటపడిన ఆ శవం కేవలం ఒక ప్రారంభం మాత్రమే అని, దీని వెనుక ఎంతో మంది అమాయకుల ప్రాణాలు ఉన్నాయని ఇన్స్పెక్టర్ కి అర్థమైంది. ఈ కేసు భద్రాచలం చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. గోదావరి నదిలో తేలిన ఆ చేయి, సమాజంలో దాగి ఉన్న క్రూరత్వాన్ని బయటపెట్టింది.

ఈ భయంకరమైన నిజం రాష్ట్రంలోనే ప్రకంపనలు సృస్టించింది. ఇంతలోనే మరో సంఘటన.. రెండు రోజుల అనంతరం కూనవరం రోడ్ లో గోదావరి నది ఒడ్డున పాతిపెట్టిన శవాన్ని వీధి కుక్కలు బయటకి లాగి పీక్కు తింటున్న విషయాన్ని చూసి, అక్కడ రైతు పోలీస్ కి ఫోన్ చేసాడు. ఇన్స్పెక్టర్ వెంటనే తన సిబ్బందిని తీసుకొని సంఘటనా స్థలం చేరుకున్నాడు. పనివాళ్ళ తో అక్కడ తవ్వించి భూమిలో పాతిపెట్టిన శవాన్ని బయటకు తీయించాడు. గుప్పుమని దుర్వాసన కొట్టింది. ఇన్స్పెక్టర్ కర్చీఫ్ తో ముక్కు మూసుకొని శవాన్ని పరిశీలనగా చూసాడు. ఎవరో మగ మనిషి శవం అది. వయసు ముప్పై సంవత్సరాలు ఉండొచ్చు. ఈ శవంపై కూడా దుస్తులు లేవు. పోస్ట్ మార్టంకి శవాన్ని పంపించమని సిబ్బందికి చెప్పి ఇన్స్పెక్టర్ జీపు ఎక్కాడు. సైరన్ మోగిస్తూ జీపు బయలుదేరింది. సరాసరి గవర్నమెంట్ హాస్పిటల్ పోస్ట్ మార్టం రూమ్ కి పోనివ్వమని డ్రైవర్ కోటికి చెప్పి ఇన్స్పెక్టర్ సాలోచనగా నుదురు రుద్దుకున్నాడు.పది నిముషాలలో జీపు పోస్ట్ మార్టం జరిగే ప్రదేశానికి చేరుకున్నది. డాక్టర్ రామక్రిష్ణ శవాన్ని పోస్ట్ మార్టం చేస్తున్నారు. శవ పరీక్షకి సుమారు గంటన్నర సమయం పట్టింది. ఇన్స్పెక్టర్ అబ్బయ్య ఊహించింది నిజమైంది. ఈ శవం కి కూడా శరీరం లో ఇన్నర్ పార్ట్స్ లేవు. రాష్ట్రం లో అలజడి చెలరేగింది. ఎక్కడ చూసినా ప్రజలు ఇదే విషయం మాట్లాడు కుంటున్నారు. ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాలో రక రకాల వార్తలు వస్తున్నాయి. జిల్లా పోలీస్ బాస్ అయిన సూపరింటెండెంట్ సునీల్ దత్ భద్రాచలంలోనే మకాం వేసాడు. పోలీస్ పై ప్రెజర్ ఎక్కువైంది. ఈ రెండు శవాలకి ఏదో విషయంలో సారూప్యత ఉందని ఇన్స్పెక్టర్ కి అనిపించింది. సంఘటన జరిగిన ప్రాంతం ప్రధాన కూడలి వద్ద, రహదారుల వెంట అమర్చి ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ని ఇన్స్పెక్టర్ పరిశీలించారు. క్లూస్ ఏమి లభ్యం కాలేదు. పట్టణం లోని అందరు ఆటో డ్రైవర్ లను, క్యాబ్ డ్రైవర్లని స్టేషన్ కి పిలిపించి ప్రశ్నించాడు. లాభం లేకపోయింది. రోజులు గడిచినా కూడా కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడం ఇన్స్పెక్టర్ ని ఒకింత నిరాశకి గురి చేసింది. ఎలా అయినా ఈ కేస్ అంతు చూడాలని ఇన్స్పెక్టర్ మనసులో దృడంగా నిశ్చయించాడు. అయితే భద్రాచలం నాలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం. ఎక్కడో చంపేసి ఇక్కడ పాతిపెడుతున్నారా?.. లేక ఇదే ప్రాంతంలో అవయవాలు సర్జరీ ద్వారా తొలగించి ఆ శవాలను ఇక్కడ బరియల్ చేస్తున్నారా? అనే విషయం పజిల్ గా మారింది. రోడ్డు మార్గం ద్వారా వాహనంలో శవాలని తీసుకొని రాకుండా వేరే మార్గంలో అంటే నదిలోని పడవల లో వేసుకొని శవాలని నది ఒడ్డున పాతిపెడుతున్నారేమో?..శవాన్ని ఒకరే మోసుకొని వచ్చి, గోదావరి నది ఒడ్డున పాతి పెట్టడం సాధ్యం కాదు. కనీసం ముగ్గురు లేదా నలుగురు ఈ ఘాతుకంలో పాల్గొని ఉండొచ్చు. వారెవరు?.. ఈ హత్యలకి కారణం ఏమిటి?.. శవాల శరీరం లోని అవయవాలు ఎలా మాయమవుతున్నాయి?..ఈ రాకెట్ వెనుక ఎవరున్నారు?.? ఇన్స్పెక్టర్ అబ్బయ్యకి రకరకాల ఆలోచనలతో మస్థిష్కం వేడెక్కింది. కాలింగ్ బెల్ కొట్టి, వచ్చిన కానిస్టేబుల్ తో కాఫీ తెమ్మని చెప్పాడు. వేడి కాఫీ సిప్ చేస్తూ అతని ఆలోచన మళ్ళీ ఈ హత్యలపైకి వెళ్ళింది. గోదావరి నది ఒడ్డున పోలీస్ పెట్రోలింగ్ పెంచాడు. గోదావరి నదిలో తిరిగే చేపలు పట్టే పడవలపై కూడా రహస్యంగా ఇన్స్పెక్టర్ దృష్టి పెట్టాడు. ఇంతలో ఇన్స్పెక్టర్ కి ఫ్లాష్ లా ఒక ఆలోచన మెదిలింది. అన్ని వెహికిల్స్ ని చెక్ చేస్తారు కానీ అంబులెన్సు వాహనాలను పోలీస్ ఆపరు. లోపల ఉన్న పెషేంట్లకి ప్రతీ క్షణం విలువైనది కాబట్టి మానవతా దృక్పధంతో ఆలోచించి పోలీసులు అంబులెన్సులను ఎక్కడా చెక్ చేయరు. వదిలేస్తారు. ఒకవేళ ఈ మృతదేహాలను అంబులెన్సు లలో తరలించడం జరుగుతుందా?.. అని ఇన్స్పెక్టర్ అనుకున్నాడు. సహజంగా హతుల వివరాలు, ఆధారాలు ఏవైనా లభిస్తే, ఆటోమేటిక్ గా హంతకుల వివరాలు కూడా తెలుస్తాయి. నేర పరిశోధనలో హతుల వివరాలు తెలుసుకోవడం చాలా కీలకం. మృత దేహాలు ఈ ప్రాంతం వారివి కావు. అందుకే వివరాలు ఏమాత్రం తెలియడం లేదని ఇన్స్పెక్టర్ భావించాడు. 

         ***

 రాజుపేట కాలనీ భద్రాచలం శివారు ప్రాంతం. చత్తిస్ ఘడ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలనుండీ ఈ ప్రాంతంలో కూలీ పనులు చేయడానికి వలస కూలీలు, గొత్తికోయలు, ఇతర గిరిజనులు ఎక్కువగా ఇక్కడ నివాసం ఉంటారు. ఇంటి అద్దెలు కూడా బాగా తక్కువగా ఉంటాయి. ఇన్స్పెక్టర్ అబ్బయ్య రాజుపేటపై దృష్టి సారించాడు. ఆరోజు భద్రాచలం డివిజన్ చరిత్రలో తొలిసారి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ రాజుపేట కాలనీ లో జరిగింది. భద్రాచలం పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు, 141 బెటాలియన్ కి చెందిన CRPF బలగాలు సుమారు 150 మందికి పైగా రాజుపేట ని దిగ్బంధనం చేసి కాలనీ లో ఉన్న ప్రజల వివరాలు నోట్ చేసుకొని, కాలనీ అంతా జల్లెడ పట్టారు. నెంబర్ ప్లేట్స్, సరైన ధ్రువ పత్రాలు లేని ఆరు ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలు పోలీస్ స్వాధీనం చేసుకొని, అనుమానితులు నలుగురిని స్టేషన్ కి తరలించి వాళ్ళని అన్నిరకాలుగా ప్రశ్నించారు. కానీ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే పట్టణం శివారు లోని ఒక ఇంటికి తరచుగా అంబులెన్సులు వచ్చి పోతాయని ఇన్స్పెక్టర్ అబ్బయ్యకి నమ్మకమైన సమాచారం అందింది. ఆ ఇల్లు ఎవరిది?. అందులో ఎవరు ఉంటారు తెలుసుకొమ్మని, చాలా సీక్రెట్ గా ఉండాలని తన సబార్డినేట్ పోలీసులు, మెరికల్లాంటి గాలి సురేష్, సూర్యంలని పిలిచి ఇన్స్పెక్టర్ చెప్పాడు. 

       ***

వారు వెళ్లి విచారించి ఆ ఇంట్లో తండికుంట శ్రీను అనే వ్యక్తి ఉంటాడని, అతను లేబర్ ని కాంటాక్టర్ లకు సప్లై చేస్తాడని, ఈ ఊరువాడు కాదని, ఎక్కడ నుండో వచ్చి ఇక్కడ ఉంటూ తరచుగా వేరే ఊళ్లు వెళ్తూ ఉంటాడని, ఖరీదైన కార్ల లో తిరుగుతాడని, ఒకప్పుడు కాళ్ళకి చెప్పులు కూడా లేవని, అనతికాలం లోనే కోటీశ్వరుడయ్యాడని, అతని వివరాలు తెలుసుకుని ఇన్స్పెక్టర్ కి ఈ విషయాలన్నీ చెప్పారు. ఆ ఇంటిపై నిఘా పెట్టమని ఇన్స్పెక్టర్ చెప్పాడు. ఇంటికి ఎప్పుడు బయట తలుపుకి తాళం వేసి ఉంటుందని తెలుసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే ఆలస్యం చేయకుండా ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో రాజుపేట చేరుకున్నాడు. పోలీస్ వాహనాన్ని దూరంగా ఆపి కాలినడకతో ఇన్స్పెక్టర్ అనుమానితుడైన శ్రీను ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి లాక్ వేసి ఉంది. ఇన్స్పెక్టర్ ఏదో ఆలోచన వచ్చి ఇంటి వెనుక పక్కకి వెళ్లి చూసాడు. తలుపులు నెట్టగా కిర్రుమనే తెరుచుకున్నాయి. తన సిబ్బందిని సైలెంట్ గా ఉండమని చెప్పి, హోల్ స్టర్ నుండి రివాల్వర్ తీసి సేఫ్టీ కాచ్ ఆన్ చేసి, ఫైరింగ్ పొజిషన్ లో పట్టుకొని నెమ్మదిగా లోపలకి వెళ్ళాడు. లోపల ఎవరు లేరు. కానీ ఇంటిలోపల చాలా గాఢమైన వాసనతో నిండి ఉన్నది. ఆ వాసన ఫార్మాలిన్ అని ఇన్స్పెక్టర్ గ్రహించాడు. ఫార్మాలిన్ శవాలు త్వరగా పాడైపోకుండా ఉపయోగిస్తారని ఇన్స్పెక్టర్ కి తెలుసు. ఇంటి లోపల రెండు గదులే ఉన్నాయి. పడుకొనే ఒక నవ్వారు మంచం తప్ప ఎలాంటి వస్తువులు లేవు. అక్కడక్కడా తాగి పడేసిన విస్కీ సీసాలు, సిగరెట్ పీకలు ఉన్నాయి. నలిపి పడేసిన ఒక కాగితం అబ్బయ్య ద్రుష్టిలో పడింది.

       ***

 కిందకి వంగి ఆ కాగితాన్ని తీసుకొని పరిశీలించగా ఆకుపచ్చని ఇంక్ తో ఆ కాగితంపై ఒక ఫోన్ నెంబర్ రాసి ఉంది. ఆ పేపర్ ని తన జేబులో పెట్టుకున్నాడు. ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో తలుపులు దగ్గరగా వేయించి బయటకి వచ్చాడు. ఇంటి పరిసరాలు గమనించగా ఆ ఇంటి వెనుక కొద్ది దూరంలో ఒక గుడిసె ఉంది. ఆవరణ చాలా ఖాళీ స్థలం ఉంది. సుమారు ఎకరం పైనే ఉంటుందని అనుకున్నాడు.అక్కడక్కడ ఉన్న ఎత్తయిన మట్టి దిబ్బలు ఇన్స్పెక్టర్ దృష్టి దాటిపోలేదు. చుట్టూ జామాయిల్ చెట్లు గుబురుగా పెరిగి ఉన్నాయి. ఇన్స్పెక్టర్ గుడిసెను సమీపించాడు. అక్కడ కూడా ఫార్మాలిన్ వాసన రావడంతో ఇన్స్పెక్టర్ భ్రకుటి ముడిపడింది. గుడిసెకి తలుపులు ఉన్నాయి. కానీ తాళం వేసి లేదు. ఇన్స్పెక్టర్ ఆదేశాలతో ఇద్దరు పోలీసులు లోపలకి వెళ్ళి చూసి ఎవరు లేకపోవడంతో అదే విషయం ఇన్స్పెక్టర్ కి చెప్పారు. మఫ్టీలో ఇద్దరు కానిస్టేబుళ్ళని ఆ ఏరియా లో ఉండమని చెప్పి ఇన్స్పెక్టర్ జీపు ఎక్కి స్టేషన్ కి వెళ్ళాడు. తన జేబులో ఉన్న పేపర్ పై రాసి ఉన్న ఫోన్ నెంబర్ ఎవరిదో తెలుసుకొమ్మని రైటర్ రాజేందర్ కి చెప్పాడు. 

      ***

గంట తరువాత రాజేందర్ సీఐ గదిలోకి వచ్చి ఆ ఫోన్ నెంబర్ ఎవరిదో వివరాలు చెప్పాడు. ఆ నెంబర్ చెన్నై నగరంలోని ప్రముఖ వైద్యుడు డాక్టర్ స్వామినాధన్ ది. అతను చెన్నై, ముంబై, బెంగళూరు లో చాలా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ నడుపున్నాడు. ఇన్స్పెక్టర్ చెన్నైలో ఉన్న తన మిత్రుడికి ఫోన్ చేసి డాక్టర్ స్వామినాథన్ కోసం తెలుసుకోగా, చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. ఈ విషయాలన్నీ అబ్బయ్య తన నోట్ బుక్ లో రాసుకున్నాడు. రెండు రోజుల తరువాత మఫ్టీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి, తండికుంట శ్రీను ఇంటికి వచ్చిన సంగతి చెప్పాడు. అలెర్ట్ అయిన ఇన్స్పెక్టర్ పది నిముషాలలో రాజుపేట చేరుకున్నాడు. ఫర్లాంగ్ దూరంలో వెహికిల్ ఆపి ఎలాంటి అలికిడి లేకుండా శ్రీను ఇంటి చుట్టూ పోలీస్ ని మోహరించి, తలుపు కొట్టాడు. ఎవరు అంటూ లోపల నుండి ఒక గొంతు చాలా భీకరంగా వినిపించింది. ఆ గొంతులో క్రౌర్యాన్ని ఇన్స్పెక్టర్ గమనించాడు. నేను ఇన్స్పెక్టర్ ని. శ్రీను.. నువ్వు ఒకసారి బయకి రా అని చెప్పాడు. లోపల చాలా సేపు నిశ్శబ్దం. ఇంతలో వెనుక తలుపులు తీసుకొని తండికుంట శ్రీను పారిపోవడానికి ప్రయత్నం చేయగా, వెనుక ఉన్న పోలీసులు శ్రీనుని గట్టిగా పట్టుకున్నారు. శ్రీను నల్లగా, ఎర్రటి కళ్ళతో, ఎత్తుగా, బట్ట తలతో చాలా భయంకరంగా ఉన్నాడు. వారెంట్ ఉందా అని ఇన్స్పెక్టర్ ని ప్రశ్నించాడు. స్టేషన్ కి మర్యాదగా నాతో రా.. వారెంట్ చూపిస్తానని చెప్పి ఇన్స్పెక్టర్ అతన్ని జీపెక్కించమని సిబ్బంది కి చెప్పి ముందుకు అడుగు వేసాడు. ఇంతలో తనని పట్టుకున్న పోలీసులను తోసేసి శ్రీను పారిపోవాలని ప్రయత్నించగా ఆగు. లేకపోతే షూట్ చేస్తాను అని ఇన్స్పెక్టర్ హెచ్చరించాడు. మొండిగా పారిపోతున్న శ్రీనుని ఇన్స్పెక్టర్ మెరుపు వేగంతో చేజ్ చేసి రివాల్వర్ గురిపెట్టాడు. ఇక చేసేదేమి లేక, రెండు చేతులు పైకెత్తి శ్రీను లొంగిపోయాడు. శ్రీనుకి హ్యాండ్ కప్స్ వేసి జీపు ఎక్కించారు.

         ***

 స్టేషన్ కి వెళ్ళాక ఇన్స్పెక్టర్ శ్రీనుని ప్రశ్నించగా ముందు తనకేమి తెలియదని, ఆ హత్యలకి తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించాడు. నాలుగు తగిలించి, పోలీస్ స్టైల్ లో ఇన్స్పెక్టర్, తండికుంట శ్రీనుని ప్రశ్నించగా, ఒక్కో విషయం బయట పడింది. గతంలో పట్టణంలో బ్యూటీ పార్లర్ పేరుతో వ్యభిచార గృహం నడిపి, ఈమధ్యే భాగ్యనగరం భిచాణా ఎత్తేసిన కన్నెగంటి కృప అనే మహిళతో, శ్రీనుకి అనైతిక సంబంధాలు ఉన్నాయి. హోటల్, ఫంక్షన్ హాల్ నడిపే బవిరిశెట్టి వెంకటమూర్తి అనే వ్యక్తితో కూడా శ్రీను అనేక ఇల్లీగల్ వ్యాపారాలలో భాగస్వామిగా ఉండి, పలు నేరాలు, దందాలు చేసాడు. శ్రీను చేసిన ఆ నేరాలు స్వయంగా శ్రీను నోటి వెంటే వింటున్న ఇన్స్పెక్టర్ కి చిరు చెమటలు పట్టాయి. తండికుంట శ్రీను మొదటి నుండీ నేర స్వభావం కల వ్యక్తి. లేబర్ ని వివిధ ప్రాంతాలలో ఉండే కాంటాక్టర్ లకు సప్లై చేసేవాడు. అక్రమంగా అవయవాల వ్యాపారం చేసే వాళ్ళ ద్వారా శ్రీనుకి డాక్టర్ స్వామినాధన్ పరిచయం అయ్యాడు. మనుషులని వాళ్ళ దగ్గరికి పంపిస్తే ఒక్కో మనిషికి ఆరు లక్షల రూపాయలు ఇచ్చేవారు. తన దగ్గరికి పనికోసం ఇతర రాష్ట్రాల నుండీ వచ్చే లేబర్ కి ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు కార్డులు లేకపోవడం శ్రీను గుర్తించాడు. వాళ్ళ కోసం ఎవరూ రాకపోవడంతో శ్రీను ఆ లేబర్ ని అవయవాల కోసం డాక్టర్ స్వామినాధన్ దగ్గరికి పంపించాలని, ఎవరికీ అనుమానం కూడా రాదని అనుకొని తన ప్లాన్ అమలుచేసేవాడు. జీవనోపాధి కోసం శ్రీను దగ్గరికి వస్తే వాళ్ళకి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఆశ చూపించి, తన ఇంట్లో పెట్టుకొని డీల్ కుదిరాక, డాక్టర్ స్వామినాధన్ చెప్పిన ఆయా ఊళ్లలోని హాస్పిటళ్లకి వాళ్ళని పంపేవాడు. అక్కడ వాళ్లకి తెలియకుండా కిడ్నీలు, లివర్ లు, తదితర ఆర్గాన్లు ఆపరేషన్ చేసి తీసేవారు. తరువాత డాక్టర్ స్వామినాధన్ మళ్ళీ ఆ వ్యక్తులను శ్రీను దగ్గరికి పంపేవాడు. శ్రీను వాళ్ళకి రాజుపేట లోని తన ఇంట్లో షెల్టర్ ఇచ్చేవాడు. వారు కనీసం పైకి లేచే ఓపిక కూడా లేక, అనారోగ్యంతో బాధ పడుతూ నేలపై నిస్రాణగా పడి ఉండేవాళ్ళు. తమని ఇళ్ళకి పంపించమని, తమ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వమని శ్రీనుని దీనంగా ప్రాధేయ పడేవాళ్ళు. అయితే బాధితులు బయటకి వస్తే తాను చేసిన మోసం తెలుస్తుందనే ఉద్దేశంతో శ్రీను వాళ్లకి విషం ఇచ్చి చంపేవాడు. శవాన్ని వెంటనే తరలించే అవకాశం లేనప్పుడు శవం వంటిపై దుస్తులు తీసేసి ఫార్మాలిన్ చల్లేవాడు. ఇలా చేయడం వలన శవం వాసన రాదు.త్వరగా పాడవదు. ఆ అభాగ్యులు చనిపోయాక ఎవరికీ తెలియకుండా గోదావరి ఒడ్డున ఇసుకలో బరియల్ చేయించేవాడు. శవాలను రోడ్డు మార్గంలో తరలిస్తే దొరికి పోతామని ఆలోచించి, తన బంధువులైన మొసలి రాంబాబు, మొసలి ఆదయ్య లతో గోదావరి నదిలో చేపలు పట్టే వాళ్ళ నాటు పడవలో శవాలను పడేసి తరలించడం జరిగింది. ఊరు దాటిన తరువాత నిర్జన ప్రాంతంలో నది ఒడ్డులో శవాలను బరియల్ చేసేవాళ్ళు. ఒకసారి బాగా చీకటిగా ఉన్న ఆ రాత్రి ఎక్కువ దూరం పోకుండా, పొరపాటున భక్తులు స్నానం ఆచరించే స్నాన ఘట్టాల దగ్గర ఒడ్డున ఇసుకలో ఒక శవాన్ని పాతిపెట్టారు. తాగిన మైకంలో గొయ్యిని లోతుగా కూడా తవ్వలేదు. పై పైనే పాతిన ఆ శవాన్నే శరణ్య, కార్తీక్ చూసారు. ఆ విధంగా ఈ అవయవాల రాకెట్ మాఫియా బయట పడింది. చెన్నైలో ఉండే డాక్టర్ స్వామి నాధన్, డాక్టర్ రాజశేఖరన్ ఈ అవయవాల రాకెట్ లో కీలక పాత్ర ధారులుగా పోలీసులు గుర్తించారు. శ్రీనుకి వాళ్లకు ఉన్న నగదు బదిలీలు, లింకులు కూడా బయటపడ్డాయి. ఇన్స్పెక్టర్ అబ్బయ్య పోలీస్ జాగిలాన్ని తీసుకొని వచ్చి దాని సహాయంతో, రాజుపేట లోని శ్రీను ఉంటున్న ఇంటివద్ద తవ్వకాలు జరిపి మరో నాలుగు శవాలు వెలికి తీసారు. ఈ అక్రమ అవయవాల వ్యాపారంలో శ్రీను సంపాదించిన నాలుగు కోట్ల రూపాయలు, శ్రీను కొన్న రెండు ఖరీదైన కార్లు, మూడు పెద్ద భవనాలు పోలీసులు సీజ్ చేసారు. ఇన్స్పెక్టర్ అబ్బయ్య కి శ్రీనుని కేసు నుండి తప్పించమని కొందరు రాజకీయ నేతల నుండి, ప్రెజర్ వచ్చినప్పటికీ నిజాయితీ పరుడైన ఇన్స్పెక్టర్ అబ్బయ్య వాటికి ఏమాత్రం లొంగలేదు. నేరంలో భాగస్వాములైన అందరిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. రాష్ట్రంలోనే పెను సంచలనం సృష్టించిన ఈ కేసుని ఛేదించిన ఇన్స్పెక్టర్ అబ్బయ్యని పోలీస్ ఉన్నతాధికారులు, ప్రజలు అభినందించారు. హోమ్ మినిస్టర్, డీజీపీ సైతం అబ్బయ్యని అభినందించారు. బ్రతుకు తెరువు కోసం ఎక్కడినుండో వచ్చి, తండికుంట శ్రీను దురాఘతాలకి చనిపోయిన అభాగ్యుల విషయం గుర్తుకు వచ్చి ఇన్స్పెక్టర్ మనసు బాధతో నిండిపోయింది..

3 కామెంట్‌లు

  1. అన్న ని న్యూస్ చదివితే కళ్ళతో చూసినట్టే ఉంది సూపర్ క్రైమ్ న్యూస్ అన్న జై జర్నలిజం 🙏

    రిప్లయితొలగించండి
  2. Machiga ardamayye vedamga raasaru kaadu chupinchaaru. anaa meru grate anna

    రిప్లయితొలగించండి
  3. మాది భద్రాచలం అన్న ఇంత జరుగుతున్న ఒక్క విషయం కూడా బయటికి తెలవదు చాలా థాంక్స్ అన్న మీలాంటి రీపోటర్స్ వాళ్ళ విషయాలు తెలుస్తున్నాయి 🙏🙏🙏

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది