EB NEWS/భద్రాద్రి కొత్తగూడెం:
ప్రజల ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి, అనంతరం అధిక మొత్తాలను వసూలు చేస్తూ ఇబ్బందులకు గురిచేసే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ హెచ్చరించారు.
అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి, రుణాలు చెల్లించలేని పరిస్థితుల్లో ప్రజలను బెదిరించడం, వేధింపులకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడే వ్యక్తులపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు.
ప్రజలు తమ ఆర్థిక అవసరాల కోసం ప్రైవేట్ వ్యక్తుల వద్ద రుణాలు తీసుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రుణం తీసుకునే ముందు వడ్డీ, తిరిగి చెల్లింపు విధానం తదితర వివరాలను పూర్తిగా తెలుసుకోవాలని తెలిపారు.
అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగ యువతను ప్రలోభాలకు గురిచేసి, వారి నుంచి డబ్బులు వసూలు చేసే మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ముందస్తుగా డబ్బులు వసూలు చేసే వ్యక్తుల మాటలు నమ్మవద్దని, ఉద్యోగాల కోసం ఎటువంటి ముందస్తు చెల్లింపులు చేయవద్దని తెలిపారు. ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను సంబంధిత సంస్థల అధికారిక మార్గాల ద్వారా నిర్ధారించుకోవాలని సూచించారు.
ఉద్యోగాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాల పేరుతో వచ్చే అనుమానాస్పద ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, సోషల్ మీడియా ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటిపిలు, పాస్‌వర్డ్‌లు వంటి వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు.
అక్రమంగా అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తు, ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేస్తున్న వ్యక్తుల గురించి సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీసు అధికారులకు తెలియజేయాలని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

