EB NEWS/అశ్వాపురం:
అశ్వాపురం మండలం మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనుల పురోగతిని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులో జరుగుతున్న పనులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులు తుది దశకు చేరుకున్నాయని, మిగిలి ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అధికారులు పనులను వేగవంతం చేస్తూ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ఎలాంటి జాప్యం లేకుండా ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం ద్వారా ఈ నెలాఖరులోగా రైతులకు సాగునీరు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పూర్తయితే రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
రైతులకు సాగునీరు అందించి వారి వ్యవసాయానికి భరోసా కల్పించడమే తన లక్ష్యమని, ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, మండల అధ్యక్షులు, జిల్లా ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

