EB NEWS/హైదరాబాద్:
రాష్ట్రంలో వాహనదారులకు సౌకర్యంగా డ్రైవింగ్ లైసెన్స్ (DL), రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) కార్డులను నేరుగా వారి ఇళ్లకు పంపించే విధానాన్ని రవాణా శాఖ ప్రవేశపెట్టింది. ఈ కార్డులు హైదరాబాద్ నుంచే పోస్టల్ ద్వారా పంపిణీ చేయబడతాయి.
ఏజెంట్ల దోపిడీని అరికట్టడం, ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులను తగ్గించడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం ఏజెంట్ల ప్రమేయం కారణంగా వాహనదారులు అదనపు ఖర్చులు, ఆలస్యం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.
కొత్త విధానం ప్రకారం, దరఖాస్తు చేసిన రెండు వారాల్లోనే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులు నేరుగా ఇంటికి చేరనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 5 లక్షల డ్రైవింగ్ లైసెన్స్‌లు, 10 లక్షల ఆర్సీ కార్డులు జారీ అవుతున్నాయి.
ఈ చర్యతో వాహనదారులకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందుతాయని అధికారులు తెలిపారు.

