EB NEWS/ ఖమ్మం:
ఖమ్మం జిల్లాలో భూధాన్ భూముల వివాదం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. ఏళ్ల తరబడి నివసిస్తూ జీవనం సాగిస్తున్న పేద కుటుంబాలను అకస్మాత్తుగా అక్రమదారులుగా ముద్ర వేస్తూ గుడిసెల తొలగింపులు చేపట్టడం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తమకు తలదాచుకునే చోటు కూడా లేకుండా రోడ్డున పడేసిన పరిస్థితి ఏర్పడిందని బాధితులు వాపోతున్నారు.
ఇళ్లే జీవనాధారం అయిన పేదలపై చర్యలు తీసుకోవడం అన్యాయమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఆశ్రయం లేక ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు మానవతను ప్రశ్నిస్తున్నాయి. “మేమెక్కడికి వెళ్లాలి?”, “మా తప్పేంటి?” అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో భూధాన్ సమస్యపై స్పందించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రేపు ఖమ్మం జిల్లాకు రానున్నారు. బాధిత కుటుంబాలను ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు వారికి న్యాయం చేయడానికి పోరాటానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
పేదల గుడిసెల కూల్చివేతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మల్లన్న, “పేదలపై అధికార దౌర్జన్యం కొనసాగితే తాము చూస్తూ ఊరుకోమని” హెచ్చరించినట్లు తెలుస్తోంది. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
భూధాన్ భూములపై ప్రభుత్వ విధానాలు పేదల జీవితాలను దెబ్బతీస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్న వేళ, మల్లన్న రాకతో ఈ సమస్య మరింత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉంది.
బాధితులకు అండగా నిలుస్తారా? సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? అన్న ఆశతో ఖమ్మం ప్రజలు ఎదురుచూస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి