భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఎన్నికల ప్రచారం 09-02-2026 సాయంత్రం 5.00 గంటలతో పూర్తిగా ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్‌కు ముందు 48 గంటల నిశ్శబ్ద వ్యవధి (సైలెన్స్ పీరియడ్) అమలులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ మున్సిపాలిటీల చట్టం, 2019లోని సెక్షన్ 209 ప్రకారం, నిశ్శబ్ద వ్యవధి సమయంలో ఎవరూ కూడా ఎన్నికలతో సంబంధం ఉన్న ఎలాంటి బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రజలను ఉద్దేశించి ఎన్నికల ప్రచార ప్రసంగాలు చేయడం, సినిమా, టెలివిజన్, ఇతర ఎలక్ట్రానిక్ మాధ్యమాలు, మొబైల్ ఫోన్లు మరియు సోషల్ మీడియా ద్వారా ఎన్నికల ప్రచారం చేయడం పూర్తిగా నిషేధమని తెలిపారు.
అలాగే రాజకీయపరమైన ఎస్‌ఎంఎస్‌లు, బల్క్ ఎస్‌ఎంఎస్‌లు పంపడం లేదా ఇతర వినోద కార్యక్రమాల ద్వారా ప్రజలను ఆకర్షిస్తూ ఎన్నికల ప్రచారం చేయడం చట్టవిరుద్ధమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. నిశ్శబ్ద వ్యవధి సమయంలో సోషల్ మీడియాలో ప్రసారం అయ్యే సందేశాలను నిశితంగా పర్యవేక్షించనున్నట్లు తెలిపారు.
నిశ్శబ్ద వ్యవధి నిబంధనలను ఉల్లంఘించినట్లయితే సంబంధిత వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం జారీ చేసిన సూచనలు, ఆదేశాలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ, ఎంసీసీ బృందాలు మరియు పోలీస్ అధికారులు పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని, కళ్యాణ మండపాలు, హోటళ్లు, లాడ్జింగ్ కేంద్రాల్లో విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ పూర్తిగా నిషేధమని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మరియు ప్రజలు ఎన్నికల నిబంధనలను పాటిస్తూ పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి