EB NEWS/పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఉప్పాక గ్రామంలో హృదయాన్ని కదిలించే ఘటన చోటుచేసుకుంది. సంవత్సరాలుగా గ్రామస్తులతో కలిసి జీవించిన ఒక పెంపుడు కుక్క మరణించడంతో, గ్రామస్థులు దాన్ని సాధారణ జంతువుగా కాకుండా కుటుంబ సభ్యుడిగా భావించి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.
ఉప సర్పంచ్ రామ్మోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కుక్క మృతదేహానికి పూలమాలలు వేసి, కన్నీటి నివాళులు అర్పించారు. కొన్ని మహిళలు కన్నీళ్లు పెట్టుకోవడం, పిల్లలు మౌనంగా నిలబడటం అక్కడి వాతావరణాన్ని మరింత భావోద్వేగంగా మార్చింది.
ఈ కుక్క గ్రామంలో ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మెలిగి, ఇంటి వారిలా అందరి ప్రేమను గెలుచుకుంది. ఏ వేళ చూసినా గ్రామంలో తిరుగుతూ అందరితో అనుబంధం పెంచుకున్న ఈ నమ్మకమైన మిత్రుని కోల్పోవడం గ్రామస్థులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
ఈ సందర్భంగా ఉప సర్పంచ్ రామ్మోహన్ మాట్లాడుతూ,
“జంతువుల పట్ల ప్రేమ, కరుణ చూపించడం మన మనిషితనానికి నిదర్శనం. అవి మాటలాడలేకపోయినా మన భావాలను అర్థం చేసుకుంటాయి” అని అన్నారు.
ఈ సంఘటన గ్రామంలో మానవత్వానికి ప్రతీకగా నిలిచింది. జంతువుల పట్ల ప్రేమ ఎంత గొప్పదో మరోసారి గుర్తుచేసింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి