హైదరాబాద్, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
హైదరాబాద్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న తొమ్మిది మంది అరెస్టు
అరెస్టైన ఇద్దరు కీలక వ్యక్తులకు ముంబై డ్రగ్స్ వ్యాపారులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తింపు
నిందితుల నుంచి రూ. 69 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడి
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న తొమ్మిది మందిని అరెస్టు చేశామని, అందులో రవివర్మ, సచిన్ అనే ఇద్దరు కీలక వ్యక్తుల నుంచి ముఖ్యమైన సమాచారం సేకరించామని నగర సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.
నగరంలో డ్రగ్స్ విక్రయిస్తుండటంతో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు వారిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 286 గ్రాముల కొకైన్, 11 గ్రాముల ఎక్స్‌టసీ, ఒక తుపాకీ, 12 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీవీ ఆనంద్ కేసు వివరాలను వెల్లడించారు. డ్రగ్స్ కేసులో అరెస్టైన వారిలో ఇద్దరు కీలక వ్యక్తుల నుంచి ముఖ్యమైన సమాచారం సేకరించామని తెలిపారు. వారిలో రవివర్మకు ముంబైకి చెందిన ముఠాతో సంబంధాలు ఉన్నాయని, అక్కడ వాహిద్ అనే వ్యక్తికి విదేశాల నుంచి కొకైన్ వస్తుందని తెలిపారు. అతడి నుంచి నిందితులు హైదరాబాద్‌కు కొకైన్ తీసుకు వస్తున్నారని వెల్లడించారు.
ప్రేమ్ ఉపాధ్యాయ్ అనే వినియోగదారుడిని అరెస్టు చేయడంతో ఈ ముఠా గుట్టు రట్టయిందని తెలిపారు. నిందితుల నుంచి రూ.69 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాటేదాన్‌లో డ్రగ్స్ దందా చేస్తోన్న పవన్ భాటీని కూడా అరెస్టు చేసినట్లు సీవీ ఆనంద్ తెలిపారు. హేమసింగ్ అనే వ్యక్తితో కలిసి పవన్ డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి