Singareni Dependent Jobs : సింగరేణి సంస్థలో డిపెండెంట్ ఉద్యోగాలు.. డిప్యూటీ సీఎం బట్టి కీలక ఆదేశాలు...

G Rajashekar
By -
0

 


EB NEWS/TG:


సింగరేణిలో పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్‌ ఉద్యోగాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. సుమారు 300 డిపెండెంట్‌ ఉద్యోగాల ఆర్డర్లను రాబోయే 15 రోజుల్లో పూర్తి చేసి, సంబంధిత అభ్యర్థులకు అందజేయాలని అధికారులకు సూచించారు. డిపెండెంట్‌ ఉద్యోగుల పేర్ల మార్పులకు సంబంధించిన సమస్యలను మానవీయ కోణంలో పరిశీలించాలన్నారు. 


ఈ అంశంపై అధికారుల కమిటీ చేసిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో సింగరేణి ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, సంస్థ ఉన్నతాధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.


ఈ సమావేశంలో సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇళ్ల స్థలాలు, ఉద్యోగాలు, వైద్య సదుపాయాలు, ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. కార్మికులు, ప్రజాప్రతినిధులు చేసిన విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలించిన భట్టి విక్రమార్క.. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 


సింగరేణి కార్మికుల సంక్షేమానికి సంబంధించిన సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. అర్హులైన సింగరేణి కార్మికులకు జీవో నంబర్‌ 76 ప్రకారం 1,250 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పట్టాలు అందించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఆక్రమణలో ఉన్న నివాసితుల ప్రాథమిక జాబితా తయారీ ప్రక్రియను నెలలోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.


 ఇప్పటివరకు మైనింగ్‌ కార్యకలాపాలు నిర్వహించని ప్రాంతాలను గుర్తించి, ఉద్యోగులు, కార్మికుల ఇళ్ల నిర్మాణానికి అనువుగా లేఅవుట్లు రూపొందించాలని భట్టి సూచించారు. ఆ ప్రాంతాల్లో నెహ్రూ హౌసింగ్‌ కాలనీ నిర్మాణానికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్మికులకు మెరుగైన నివాస సదుపాయాలు కల్పించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులను కూడా అభివృద్ధి చేయాలని సూచించారు. 


సింగరేణి ఏరియా ఆసుపత్రులపైనా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఏరియా ఆసుపత్రులను కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందేలా ఆసుపత్రుల్లో అవసరమైన మౌలిక వసతులు, వైద్య సదుపాయాలను బలోపేతం చేయాలన్నారు.


మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ ప్రక్రియలోనూ కార్మికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని భట్టి ఆదేశించారు. ఇందుకోసం కార్మికులు ప్రత్యేకంగా కొత్తగూడెం వరకు ప్రయాణించాల్సిన అవసరం లేకుండా అన్ని ఏరియా ఆసుపత్రుల్లో ప్రతి నెలా నిర్ణీత తేదీన మెడికల్‌ బోర్డు సమావేశం నిర్వహించాలన్నారు. తద్వారా వైద్య కారణాలతో ఉద్యోగ సంబంధిత ప్రక్రియలను వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.


  

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)