యువ వైద్యురాలి మృతి.. కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు..
EB NEWS/హైదరాబాద్ :
మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 27 ఏళ్ల యువ వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. హఫీజ్‌పేట్ ఆదిత్యనగర్‌లోని ఓ ప్రైవేట్ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
మూడు రోజుల క్రితం వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన యువ వైద్యురాలు.. ఓ స్నేహితుడితో కలిసి అపార్ట్‌మెంట్‌లో బస చేసినట్లు తెలుస్తోంది. అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్‌లో అందుబాటులోకి రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పోలీసులను ఆశ్రయించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
కూతురు ఇక లేదన్న విషాద వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను కోల్పోవడంతో తల్లిదండ్రుల రోదనలు స్థానికులను కలచివేశాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ వైద్యురాలు అర్ధాంతరంగా మృతి చెందడం కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతికి గల అసలు కారణాలు పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.

