సుందరయ్య నగర్‌లో ప్రత్యేకంగా సినిమా ప్రదర్శన.. కుటుంబాలతో కలిసి వీక్షించిన స్థానికులు
EB NEWS/మణుగూరు:
ఒకప్పుడు గ్రామాలు, కాలనీల్లో పెద్ద తెరపై సినిమా చూడటం ఓ ప్రత్యేకమైన అనుభూతి. టీవీలు, మొబైల్ ఫోన్లు, ఓటీటీలు అందుబాటులో లేని ఆ రోజుల్లో సామూహికంగా సినిమా చూసిన మధుర జ్ఞాపకాలను గుర్తుచేస్తూ మణుగూరులోని సుందరయ్య నగర్ రామకృష్ణ స్కూల్ ప్రాంతంలో స్థానికులు పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి ‘ఇరుముడి’ సినిమాను సామూహికంగా వీక్షించారు.
చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి ఒకచోట చేరి సినిమా వీక్షించారు. సినిమా ప్రారంభం నుంచి చిన్నారుల సందడి, పెద్దల కబుర్లు, పరిచయస్తుల పలకరింపులతో అక్కడ సందడి నెలకొంది. గతంలో గ్రామాలు, కాలనీల్లో పెద్ద తెరలు ఏర్పాటు చేసి సినిమాలు ప్రదర్శించే రోజుల్లో ఉండే ఆత్మీయ వాతావరణాన్ని ఈ కార్యక్రమం మరోసారి గుర్తుచేసింది. సినిమా చూడటంతో పాటు ఒకరినొకరు కలుసుకోవడం, కబుర్లు చెప్పుకోవడం వంటి అనుభూతులను స్థానికులు ఆస్వాదించారు.
మొబైల్ ఫోన్లు, ఓటీటీ వేదికలతో సినిమా వీక్షణ విధానం మారిన ప్రస్తుత కాలంలో.. ఇలా సామూహికంగా పెద్ద తెరపై సినిమా వీక్షించడం స్థానికులకు ప్రత్యేక అనుభూతిని అందించింది. ఈ సందర్భంగా పలువురు తమ చిన్ననాటి రోజులు, అప్పటి స్నేహాలు, సామూహిక సినిమా వీక్షణ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

