ఖమ్మం జిల్లాలో వింత నమ్మకాలు… గ్రామం మొత్తం ఒక్కరోజు ఊరు విడిచివెళ్తూ సంచలనం



EB NEWS/ ఖమ్మం:


ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం బోడు గ్రామంలో వింత నమ్మకాలు చర్చనీయాంశంగా మారాయి. గ్రామానికి ఏదో కీడు సంభవించే అవకాశం ఉందన్న అపోహలతో గ్రామస్థులు అసాధారణ నిర్ణయం తీసుకున్నారు.


గ్రామంలో పిల్లలు, మహిళలు, వృద్ధులు సహా అందరూ ఆదివారం (నేడు) రోజంతా ఊరు వెలుపల గడపాలని తీర్మానించారు. స్థానిక పూజారుల సూచన మేరకు వేకువజామునే ఇళ్లకు తాళాలు వేసి గ్రామం విడిచివెళ్లారు. రోజంతా అడవి ప్రాంతాలు లేదా పొలాల్లో గడిపి, సూర్యాస్తమయం అనంతరం మాత్రమే తిరిగి గ్రామానికి చేరుకోవాలని నిర్ణయించుకున్నారు.


గ్రామానికి ఎలాంటి దుష్ప్రభావం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనపై సామాజిక వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శాస్త్రీయ దృష్టికోణంలో ఇలాంటి నమ్మకాలకు ఆధారం లేదని కొందరు అభిప్రాయపడుతుండగా, మరికొందరు సంప్రదాయాలపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.


ఈ పరిణామం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అధికారుల స్పందన ఏమిటన్నది

 ఆసక్తికరంగా మారింది.


Post a Comment

కొత్తది పాతది