మణుగూరులో 55 ఏళ్ల కాళీమాత ఆలయానికి పునఃప్రతిష్ఠ మార్గం సుగమం


 


మణుగూరు శ్రీ కాళీమాత ఆలయ పునఃప్రతిష్ఠకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సానుకూల స్పందన


ప్రత్యామ్నాయ స్థలం, నష్టపరిహారం కల్పించాలంటూ కలెక్టర్‌కు లేఖ


EB NEWS/మణుగూరు, ఫిబ్రవరి 25 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని చారిత్రాత్మక శ్రీ కాళీమాత ఆలయ తరలింపు, పునఃప్రతిష్ఠ అంశంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి  జి. కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. బి.టి.పి.ఎస్. (BTPS) రైల్వే లైన్ నిర్మాణ పనుల్లో భాగంగా 55 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని ప్రస్తుత స్థలం నుండి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.


ఆలయ కమిటీ తరఫున అందిన విన్నపాన్ని పరిశీలించిన మంత్రి, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్‌కు అధికారిక లేఖ పంపించారు.


రైల్వే లైన్ నిర్మాణం కారణంగా ఆలయాన్ని తరలించాల్సి వస్తున్న నేపథ్యంలో, శాస్త్రోక్తంగా పునఃప్రతిష్ఠ చేయడానికి తగిన ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని, ఆలయ నిర్మాణం మరియు తరలింపుకు అవసరమైన నష్టపరిహారాన్ని నిబంధనల ప్రకారం అందించాలని మంత్రి సూచించారు.


గత 55 ఏళ్లుగా ప్రాంత భక్తుల ఆరాధ్య దైవంగా ఉన్న కాళీమాత ఆలయానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను, భక్తుల సెంటిమెంట్లను దృష్టిలో ఉంచుకుని సమస్యను పరిష్కరించాలని లేఖలో పేర్కొన్నారు. 


ఆలయ ట్రస్ట్  ఉప్పల సత్యనారాయణ శాస్త్రి కుమారుడు శ్రీ ఉప్పల శ్రీఖర్ , హిందూ బంధువు శ్రీ గడ్డం రాము అందించిన విన్నపం మేరకు మంత్రి స్పందించారు. నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


మంత్రి నిర్ణయంపై ఆలయ కమిటీ సభ్యులు, మణుగూరు ప్రాంత భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Post a Comment

కొత్తది పాతది