EB NEWS/అశ్వాపురం, ఫిబ్రవరి 25:
అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామపంచాయతీ పరిధిలో HWPM గోడకు ఆనుకుని గత 30 ఏళ్లుగా నివసిస్తున్న పేద కుటుంబాలకు ఖాళీ చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి నోటీసులు జారీ కావడంతో ఆందోళన నెలకొంది.
దశాబ్దాలుగా అక్కడే నివసిస్తూ జీవనోపాధి కొనసాగిస్తున్న ఈ కుటుంబాలు బలహీన వర్గాలకు చెందినవని, వారికి ప్రత్యామ్నాయ నివాస సదుపాయం లేదని స్థానికులు చెబుతున్నారు. ఆకస్మికంగా ఖాళీ చేయమని నోటీసులు ఇవ్వడం వల్ల తమకు నిరాశ్రయులయ్యే పరిస్థితి ఏర్పడిందని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ఈ అంశంపై మాల మహానాడు జిల్లా కార్యదర్శి కాలవ సంసొన్, జిల్లా సహాయ కార్యదర్శి మేకల భాస్కర్ తీవ్రంగా స్పందించారు. పేదల జీవన హక్కులను ప్రభుత్వం పరిరక్షించాలని, పునరావాసం కల్పించకుండా ఖాళీ చేయించడం అన్యాయమని వారు పేర్కొన్నారు.
వెంటనే బాధిత కుటుంబాలకు ఇళ్ల స్థలాలు లేదా శాశ్వత నివాస సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారులు మానవతా దృక్పథంతో స్పందించి, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో ఈ అంశంపై పెద్దఎత్తున ప్రజా ఆందోళనలు చేపడతామని మాల మహానాడు ప్రతినిధులు హెచ్చరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి