ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
గ్రామంలోని పిల్లలు అందరిని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతులతో నాణ్యమైన విద్యను అందిస్తామని, డబ్బు ఖర్చు చేసి విద్యను కొనుక్కోవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరకగూడెంలో జరిగిన బడిబాట కార్యక్రమానికి సంబంధించిన గ్రామ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఎన్నో ప్రయాసలకు ఓర్చి ప్రభుత్వ పాఠశాలలను సౌకర్యవంతంగా తీర్చిదిద్ది నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్న సందర్భంలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి వాటిని బలోపేతం చేయవలసిన అవసరం ఉందని అన్నారు.
*ఈ విద్యా సంవత్సరమే నవోదయ విద్యాలయం ప్రారంభం*
ఈ విద్యా సంవత్సరం కరకగూడెంలో జవహర్ నవోదయ విద్యాలయాన్ని ప్రారంభిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయని, వేరువేరు ప్రదేశాల నుండి ఈ విద్యాలయంలో విద్యార్థులు ప్రవేశం పొందుతారు కావున వారిని కూడా మన సొంత పిల్లల్లాగానే ఆదరించి పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని, నవోదయ విద్యాలయం ద్వారా దేశంలోనే అత్యంత నాణ్యమైన విద్యను భద్రాద్రి జిల్లా విద్యార్థిని విద్యార్థులకు అందుబాటులోకి రావడం మన జిల్లా అదృష్టమని అన్నారు. జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటుకు జరుగుతున్న వసతులను పరిశీలించి జూన్ 12వ తేదీ కల్లా అన్ని రకాల పనులను పూర్తి చేసి పాఠశాలల సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఎం. వెంకటేశ్వర చారి, జిల్లా అకాడమిక్ కోఆర్డినేటర్ ఏ.నాగరాజు శేఖర్, కరకగూడెం మండల విద్యాధికారి జి.మంజుల, విద్యాశాఖ ఇంజనీరింగ్ డీఈ, ఏఈ, తాసిల్దార్, మండల అభివృద్ధి అధికారి, మండల సమాఖ్య సభ్యులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి