కరకగూడెంలో భీమరాజుపై కత్తులతో దాడి.. నలుగురు అరెస్ట్

G Rajashekar
By -
0




EB NEWS/కరకగూడెం: 

అశ్వాపురంపాడు గ్రామ శివారులోని ఫారెస్ట్ ప్లాంటేషన్ వద్ద ఈ నెల 19న వజ్జా భీమరాజుపై కత్తులతో దాడి చేసిన ఘటనలో నలుగురు నిందితులను కరకగూడెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


పోలీసుల ప్రకారం.. అశ్వాపురంపాడు గ్రామానికి చెందిన వజ్జా భీమరాజు పశువులను మేపేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లిన సమయంలో నిందితులు అతడిని వెంబడించి కత్తులతో మెడ, తలపై విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.


ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కోవాసి బాలకృష్ణ, పోడియం విజయ్, కోవాసి సంతోష్, పోడియం మంగయ్యలను నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.


పోలీసుల వివరాల ప్రకారం.. మొదటి నిందితుడు బాలకృష్ణ తండ్రి వెంకటేశ్వర్లు గతంలో హత్యకు గురయ్యారు. ఆ హత్య కేసులో భీమరాజు నిందితుడిగా జైలుకు వెళ్లి విడుదలైన తర్వాత, తండ్రి హత్యకు ప్రతీకారంగా భీమరాజుపై దాడి చేయాలని నిందితులు పథకం వేసినట్లు విచారణలో వెల్లడైంది.


అరెస్టు చేసిన నలుగురు నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.


ఈ కేసు దర్యాప్తులో ఏడుల్ల బయ్యారం సీఐ వి. వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్సై పి.వి.ఎన్. రావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)