EB NEWS/పినపాక:
గృహ విద్యుత్ వినియోగదారులకు సౌర విద్యుత్ వినియోగం, ప్రభుత్వ సబ్సిడీ, బ్యాంకు రుణ సౌకర్యాలపై అవగాహన కల్పించేందుకు “సూర్య–సేతు” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పినపాక ఏఈ వేణుగోపాల్ తెలిపారు..
బుధవారం ఆయన పినపాక మండలం ఈ బయ్యారంలో గల సబ్స్టేషన్ వద్ద మాట్లాడారు. పీఎం సూర్య ఘర్–ముఫ్త్ బిజ్లీ యోజన కింద అర్హులైన వినియోగదారులకు 1 కిలోవాట్‌కు రూ.30 వేల వరకు, 2 కిలోవాట్లకు రూ.60 వేల వరకు, 3 కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యానికి గరిష్టంగా రూ.78 వేల వరకు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ అందుతుందని వివరించారు.
భద్రాచలం డివిజన్ కార్యాలయంలో అక్టోబర్ 1, 2 తేదీల్లో, మణుగూరు సబ్‌స్టేషన్ ప్రాంగణంలో అక్టోబర్ 3న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సూర్య–సేతు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో సోలార్ వెండర్లు, బ్యాంకు లీడ్ మేనేజర్లు పాల్గొని సౌర విద్యుత్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలు, సబ్సిడీ, రుణ సౌకర్యాలపై వినియోగదారులకు అవగాహన కల్పిస్తారని చెప్పారు. అర్హులైన వినియోగదారులకు అక్కడికక్కడే స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా ఉంటుందన్నారు.
గృహ విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పినపాక ఏఈ వేణుగోపాల్ కోరారు.

