ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా విద్యుత్ షాక్‌కు గురైన చిన్నారి
EB NEWS/కొణిజర్ల:
ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం చిన్నమునగాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న 9 నెలల బాలుడు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇలెందుల రమేష్, మమత దంపతుల కుమారుడు జవెద్ ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ఎర్త్ వైర్‌కు సంబంధం ఉన్న స్టీల్ పైపును తాకాడు.
వర్షం కారణంగా పైపుకు విద్యుత్ ప్రసరణ జరగడంతో బాలుడు షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే తల్లిదండ్రులు బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
చిన్నారి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తొమ్మిది నెలల బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వర్షాకాలంలో విద్యుత్ పరికరాలు, వైర్లు, పైపులు, ఇతర విద్యుత్ ప్రసరణకు సంబంధించిన వస్తువుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు విద్యుత్ వైర్లు, పరికరాలు, నీరు నిలిచిన ప్రాంతాల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

