ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తదితరుల విజ్ఞప్తి
EB NEWS/హైదరాబాద్, :
ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న స్థానిక ఆదివాసీ, గిరిజన నిరుద్యోగ యువతకు పోలీస్ ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, వెడ్మ బొజ్జు, రాందాస్ నాయక్‌లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని కోరారు.
ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ అందజేశారు. అంతకుముందు అసెంబ్లీలోనూ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఏజెన్సీ ప్రాంతాల గిరిజన యువతకు పోలీస్ ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.
2026లో విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ (SCT Civil Constable) నియామక నోటిఫికేషన్‌లో ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించిన పోస్టుల్లో 75 శాతం రిజర్వేషన్ అమలు చేయకపోవడం వల్ల స్థానిక ఆదివాసీ, గిరిజన నిరుద్యోగ యువతకు నష్టం జరుగుతోందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఏజెన్సీ ప్రాంతాల్లోని స్థానిక గిరిజన యువతకు ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు గతంలో అమల్లో ఉన్న ప్రత్యేక నిబంధనలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం కొనసాగుతున్న పోలీస్ నియామక ప్రక్రియలోనూ 75 శాతం రిజర్వేషన్ అమలు చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పోలీస్ సివిల్ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి G.O.Ms.No.109, తేదీ 17.06.1988, అలాగే Gazette Notification No.49, తేదీ 10.05.2018 ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో 75 శాతం రిజర్వేషన్‌కు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు ఉన్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.
ఏజెన్సీ ప్రాంతాల ప్రత్యేక పరిస్థితులు, అక్కడి స్థానిక గిరిజన యువతకు ఉన్న ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఈ రిజర్వేషన్‌ను అమలు చేయడం అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా పినపాక నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని అన్ని ఏజెన్సీ ప్రాంతాల గిరిజన నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
2026 పోలీస్ నియామక ప్రక్రియలో 75 శాతం రిజర్వేషన్ అమలు చేసేలా అవసరమైన చర్యలు తీసుకుని, ఏజెన్సీ ప్రాంతాల గిరిజన యువత భవిష్యత్తును కాపాడాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, వెడ్మ బొజ్జు, రాందాస్ నాయక్‌లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు.

