తుఫాన్ దెబ్బకు రైతన్న విలవిల.. 200 ఎకరాల్లో పంట నష్టం

G Rajashekar
By -
0

 

వేపలగడ్డ, మొరంపల్లి బంజర్ ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు


EB NEWS/బూర్గంపాడు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు: తుఫాన్ ప్రభావంతో బూర్గంపాడు మండలంలోని వేపలగడ్డ, మొరంపల్లి బంజర్ ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా పత్తి, మిర్చి, వరి పంటలు దెబ్బతిన్నాయి. సుమారు 150 నుంచి 200 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు రైతులు చెబుతున్నారు.


పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో పాటు విద్యుత్ తీగలు తెగిపడినట్లు స్థానికులు తెలిపారు. నెలల తరబడి పంటలను కాపాడుకున్న సమయంలో ప్రకృతి వైపరీత్యం కారణంగా పంటలు దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగు కోసం చేసిన పెట్టుబడులు, ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు వృథా అయ్యే పరిస్థితి ఏర్పడిందని రైతులు పేర్కొన్నారు.


పంట నష్టంతో పాటు ఇళ్లు దెబ్బతిని నిరాశ్రయులైన బాధితులను పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పరామర్శించారు. ఆయా ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిని పరిశీలించి, పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రైతులకు అండగా ఉంటామని తెలిపారు. తక్షణమే పంట నష్టం ఎంత మేర జరిగిందో అంచనా వేసి నమోదు చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.


అలాగే ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దెబ్బతిన్న పంటలు, ఇళ్ల నష్టాన్ని అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.


తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే దెబ్బతిన్న పంటలకు మరింత నష్టం వాటిల్లకుండా అధికారులు పరిస్థితిని పరిశీలించాలని రైతులు కోరుతున్నారు. పంట నష్టాన్ని నమోదు చేసి ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించాలని, దెబ్బతిన్న విద్యుత్ లైన్లను త్వరగా పునరుద్ధరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)