పాల్వంచ: పరీక్షా కేంద్రంలో బాలిక ప్రసవం ఘటనపై హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సస్పెండ్


 EB NEWS/భద్రాద్రి:


పాల్వంచ ఇంటర్ పరీక్షా కేంద్రంలో జరిగిన వివాదాస్పద ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల నిర్వహించిన పబ్లిక్ పరీక్షల సందర్భంగా ఒక ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థిని పరీక్షా కేంద్రంలోని వాష్‌రూమ్‌లో శిశువుకు జన్మనిచ్చిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ అనంతరం పాల్వంచ గర్ల్స్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కె. లక్ష్మిని సస్పెండ్ చేస్తూ ఐటిడిఏ భద్రాచలం ప్రాజెక్టు అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.


అధికారుల వివరాల ప్రకారం, హాస్టల్‌లో నిర్వహించాల్సిన ఆరోగ్య పర్యవేక్షణ, మెడికల్ రికార్డుల సంరక్షణలో నిర్లక్ష్యం జరిగినట్లు గుర్తించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై సమయానికి సమీక్ష చేయకపోవడం, అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి అంశాలు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.


ఈ ఘటనతో విద్యార్థుల భద్రత, హాస్టల్ నిర్వహణపై ప్రశ్నలు తలెత్తాయి. బాధ్యతారాహిత్యం కారణంగా సంస్థ ప్రతిష్టకు భంగం కలిగిందని అధికారులు అభిప్రాయపడ్డారు. పూర్తి స్థాయి శాఖాపరమైన విచారణ కొనసాగుతుందని, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.


ఈ ఘటనపై స్థానికంగా ఆందోళనలు వ్యక్తమవుతుండగా, విద్యార్థినుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.


Post a Comment

కొత్తది పాతది