కొత్తగూడెం: ఆటో డ్రైవర్ నుంచి మేయర్ వరకూ… స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఇద్దరి ప్రస్థానం

 


EB NEWS/కొత్తగూడెం:


కొత్తగూడెం జిల్లాలో ఆటో డ్రైవర్లుగా జీవితం ప్రారంభించి ఉన్నత పదవుల వరకు ఎదిగిన కంచర్ల జమలయ్య, మూడ్ గణేష్‌ల ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. కష్టపడి పని చేస్తే ఏ స్థాయికైనా చేరుకోవచ్చని వారు తమ జీవితంతో నిరూపించారు. 


కంచర్ల జమలయ్య ఆటో డ్రైవర్‌గా జీవనం ప్రారంభించి, ఆటో యూనియన్‌లో పట్టణ అధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారు. అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజల విశ్వాసాన్ని సంపాదించారు. ఆయన రెండు సార్లు ఉత్తమ కౌన్సిలర్ అవార్డులు అందుకోవడం విశేషం. ప్రజాసేవా మార్గంలో నడుస్తున్న ఆయన కుటుంబం కూడా అదే దారిలో కొనసాగుతోంది. ఆయన కుమార్తె కార్పొరేటర్‌గా ఎన్నికై ప్రజలకు సేవలందిస్తున్నారు.


ఇదే విధంగా మూడ్ గణేష్ కూడా ఆటో డ్రైవర్‌గా ప్రారంభమైన తన ప్రయాణాన్ని క్రమంగా ప్రజాసేవ వైపు మలిచారు. ఎంపీటీసీగా, కార్పొరేటర్‌గా ప్రజల మద్దతుతో ఎన్నికై, అనంతరం 60 డివిజన్లకు మేయర్‌గా బాధ్యతలు నిర్వహించారు.


సాధారణ ఆటో డ్రైవర్లుగా ప్రారంభమైన వీరిద్దరూ కష్టపడుతూ, ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. వారి ప్రస్థానం యువతకు, ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు ప్రేరణగా నిలుస్తోంది. 


Post a Comment

కొత్తది పాతది