పినపాక | ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలంలో అక్రమ బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా పెరిగిపోతూ గ్రామాల ప్రశాంతతను భగ్నం చేస్తున్నాయి. ప్రతీ గ్రామంలో పదుల సంఖ్యలో బెల్ట్ షాపులు పనిచేస్తుండగా, వైన్ షాప్ నిర్వాహకులు సిండికేట్‌గా ఏర్పడి వీటికి నిరంతరం మద్యం సరఫరా చేస్తూ కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవస్థ వల్ల గ్రామాల్లో తగాదాలు, కొట్లాటలు, కుటుంబ విభేదాలు పెరిగి మహిళలు, యువత, వృద్ధులు భయాందోళనలో జీవించాల్సిన పరిస్థితి నెలకొంది.
బహిరంగంగానే అక్రమ వ్యాపారం సాగుతున్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇది కేవలం మద్యం వ్యాపార సమస్య మాత్రమే కాకుండా, చట్టపాలనపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే పరిస్థితిగా మారుతోందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకుని బెల్ట్ షాపుల సిండికేట్‌ను సమూలంగా నిర్మూలించాలని, లేకపోతే ప్రజా ఆగ్రహం మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి