బిగ్ బ్రేకింగ్ న్యూస్... మేడారానికి రైల్వే మార్గం వేయాలి- ఎంపీ ఈటెల రాజేందర్

 



TG: ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


మేడారం సమ్మక్క సారలమ్మ జాతర.. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి గాంచింది. రెండేళ్లకు ఒకసారి జరిగే వన దేవతల జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక.. పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. సుమారు కోటికి మందికి పైగా భక్తులు.. తల్లులను దర్శించుకుని.. మొక్కులు చెల్లించుకుంటారు. నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జాతర నిర్వహిస్తారు. 


ఈ వేడుక కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ కూడా కేటాయిస్తుంది. ఈక్రమంలో తాజాగా పార్లమెంటు సమావేశంలో మేడారం జాతర గురించి కీలక అంశం చర్చకు వచ్చింది. మేడారానికి రైలు మార్గం మరోసారి తెర మీదకు వచ్చింది. ఆ వివరాలు..


పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్.. మేడారానికి రైలు మార్గం వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఈ ప్రతిపాదన ఇప్పటిది కాదు.. గత 15 ఏళ్ల నుంచి సాగుతుంది. 


భద్రాద్రి జిల్లా మణుగూరు నుంచి తాడ్వాయి(మేడారం) మీదుగా రాఘవపురం వరకు కొత్త రైల్వే లైను వేయాలని ఈటల రాజేందర్ కోరారు. బుధవారం నాడు పార్లమెంట్‌లో 377 నిబంధన కింద ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. 


అలానే మేడారాన్ని జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని రిక్వెస్ట్ చేశారు.


మేడారానికి రైల్వే లైను ప్రతిపాదన గత 15 ఏళ్లుగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం గనుక దీనికి అనుమతిస్తే.. వరంగల్‌లో ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాల అభివృద్ధితో పాటుగా సింగరేణి నుంచి బొగ్గు, ఇతర అటవీ ఉత్పత్తులను రవాణా చేయడం సులభం అవుతుంది. దీనితో పాటుగా వరంగల్, కాజీపేట రైలు మార్గాలు సైతం మణుగూరుకు కలిసే అవకాశం ఉంది. 


పైగా ఈ రైల్వే లైను ప్రతిపాదన ఆమోదం పొందితే మణుగూరు నుంచి తాడ్వాయి వరకు ఇకో టూరిజం అభివృద్ధికి బాటలు పరిచినట్లు అవుతుంది.


 ఈ రైల్వే లైను అందుబాటులోకి వస్తే.. ఇతర రాష్ట్రాల నుంచి మేడారం జాతరకు వచ్చే భక్తులకు సమయం, ఖర్చులు తగ్గుతాయి. ఖమ్మం, కొత్తగూడెం, విజయవాడ నుంచి జాతరకు వచ్చే భక్తులు వరంగల్ నుంచి కాకుండా.. డైరెక్ట్‌గా మణుగూరు నుంచి మేడారం వేళ్లే అవకాశం లభిస్తుంది. 


ఈ రైల్వే లైను కోసం కేంద్రం సర్వే జరపగా.. మూడు మార్గాలను ప్రతిపాదించారు. దీనిలో ఏదో ఒకదానికి కేంద్రం ఆమోదం తెలిపే అవకాశం ఉందంటున్నారు. ఈ రైల్వే లైన్‌కున్న ప్రధాన అడ్డంకి ఏదంటే.. అటవీ శాఖ నుంచి భూములు సేకరించడమే అంటున్నారు అధికారులు.

Post a Comment

أحدث أقدم