ప్రాణాలు హరిస్తున్న గడ్డి మందుపై నిషేధం విధించాలి

 

తెలంగాణ రాష్ట్రంలో క్షణికావేశంలో పారాక్వాట్ తాగి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది 

 లోక్ సభలో 377 నిబంధన కింద ప్రస్తావించిన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి 


ఢిల్లీ, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్: 


తెలంగాణ రాష్ట్రంలో పంటల సాగులో కలుపు నివారణకు వినియోగించే అత్యంత విషపూరితమైన పారాక్వాట్ అనే గడ్డి మందును క్షణికావేశంలో తాగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని.. కేంద్ర ప్రభుత్వం దీనిని నిషేధించాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో కోరారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా.. బుధవారం 377 నిబంధన కింద ఈ అంశాన్ని ప్రస్తావించారు. వైద్య చికిత్సలో విరుగుడు లేక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రాణాలు కోల్పోతున్న రైతులు, వ్యవసాయ కూలీలు, యువకుల సంఖ్య ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

60కి పైగా దేశాల్లో నిషేధం

పారాక్వాట్ పై 60 కి పైగా దేశాలు నిషేధం విధించాయని తెలిపారు. దీని వినియోగంతో పర్యావరణానికి కూడా ముప్పు పొంచి ఉందని, గోధుమలు, పప్పు ధాన్యాలు వంటి ప్రధాన పంటల్లో ఈ గడ్డి మందు అవశేషాలు గుర్తించారని, ప్రజల ఆరోగ్యానికి కూడా హాని పొంచి ఉందని పేర్కొన్నారు. పారాక్వాట్ కు ప్రత్యామ్నాయ మందును అందుబాటులోకి తెచ్చి.. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని..ఈ సందర్భంగా కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాను కోరారు. గడ్డి మందు నిషేధంపై కేంద్రం తీసుకునే నిర్ణయాత్మక చర్య మన వ్యవసాయాన్ని, సమాజ గౌరవాన్ని నిలబెడతాయని ఎంపీ రఘురాం రెడ్డి సూచించారు.

Post a Comment

కొత్తది పాతది