భద్రాచలం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
రెండు నెలలు శ్రమించి వెంటలేటర్ పై ఉన్న గిరిజన యువతి కి ప్రాణదానం చేసిన భద్రాచలం ఏరియా ఆసుపత్రి సిబ్బంది
భద్రాచలం,చర్ల ఆసుపత్రుల వైద్య సిబ్బందిని అభినందించిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ , ఐటీడీఏ పీ ఓ రాహుల్ మరియు డిసిహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు*.
****
రెండు నెలల పాటు భద్రాచలం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందించి పురుగుల మందును సేవించిన ఒక మహిళకు భద్రాచలం ఆసుపత్రి సిబ్బంది ప్రాణం పోశారు. వివరాల్లోకెళ్తే, చర్ల మండలం లక్ష్మీ కాలనీకి చెందిన 22 ఏళ్ల మడకం శిరీష అనే మహిళ మోనోక్రోటోఫోస్ అనే పురుగుల మందును రెండు నెలల క్రితం ఏప్రిల్ ఒకటవ తేదీన త్రాగి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చర్లకు వెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి, కడుపులో ఉన్న పురుగుల మందును కొంత బయటకు తీశారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. విషపూరితమైన మోనోక్రోటోఫోస్ పురుగుల మందు అప్పటికే ఊపిరితిత్తులపై కొంత ప్రభావం చూపించగా కోన ఊపిరి తో ఉన్న ఆమెను ఊపిరి తిత్తుల వైద్యులు డాక్టర్ జగదీష్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది రెండు నెలల పాటు వెంటలేటర్ పై చికిత్స అందించి ఆ మహిళ ప్రాణాన్ని నిలబెట్టారు. ఆమెను డిస్చార్జ్ చేసే క్రమంలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు ఆసుపత్రిని సందర్శించి ఆమెకు చికిత్స చేసిన డాక్టర్ జగదీష్ మరియు ఇతర వైద్య సిబ్బందిని అభినందించారు. ఆసుపత్రిలో అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ భద్రాచలం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ ను అభినందించారు. రెండు నెలలు కష్టపడి వెంటిలేటర్ పై ఉన్న మహిళకు ఊపిరి పోసినందుకు భద్రాచలం వైద్య సిబ్బందిని మరియు వెంటనే స్పందించి ప్రాథమిక చికిత్స చేసినందుకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చర్ల వైద్య సిబ్బందిని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్,ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ మరియు జిల్లా ఆసుపత్రుల ప్రధాన పర్యవేక్షణ అధికారి డాక్టర్ రవిబాబు అభినందించారు. ఇదే స్పూర్తితో రోగుల పట్ల అంకిత భావంతో సేవలందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
*ఆనందభాష్పాలతో కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు*
రెండు నెలలు రేయింబవళ్లు ఎంతో ఓపికతో చికిత్స చేసి తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడిన భద్రాచలం వైద్య సిబ్బందికి శిరీష తండ్రి రమేష్ ధన్యవాదాలు తెలియజేశారు. “ నా కూతురికి పునర్జన్మ ప్రసాదించిన భద్రాచలం , చర్ల వైద్యులకు, వైద్య సిబ్బందికి ఏమిచ్చిన రుణం తీర్చుకోలేనూ “ అని ఆనందభాష్పాలతో తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
إرسال تعليق