EB NEWS/హైదరాబాద్:
తెలంగాణలో రైతులకు ఉచితంగా యూరియా ఎరువు అందించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. రైతులకు ఊరట కలిగించే చర్యగా ఉచిత యూరియా సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది.
ప్రస్తుతం రైతు భరోసా నిధుల విడుదల ఆలస్యమవుతున్న నేపథ్యంలో, యూరియా ఉచితంగా అందిస్తే రైతులకు కొంత ఉపశమనం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపితే, ఆర్థిక శాఖ తుది నిర్ణయం తీసుకుని బడ్జెట్ ప్రతిపాదనల్లో చేర్చే అవకాశం ఉంది.
గత ప్రభుత్వ హయాంలో కూడా రైతులకు ఉచిత యూరియా పంపిణీ చేయాలని ప్రతిపాదనలు వచ్చినప్పటికీ, అవి అమలు దశకు చేరుకోలేదు. ఈసారి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో రైతుల్లో ఆసక్తి నెలకొంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి