మణుగూరును కుదిపేసిన ఘటన… ఒకేరోజు ముగ్గురు వ్యాపారుల కన్నుమూత




 EB NEWS/మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తులు ఈరోజు అనారోగ్య కారణాలతో మరణించడం పట్టణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పట్టణ అభివృద్ధికి, వ్యాపార రంగానికి తమదైన సేవలు అందించిన ఈ ముగ్గురు వ్యక్తుల మరణం మణుగూరు ప్రజలకు తీరని లోటుగా మారింది.


మణుగూరులో ప్రముఖ మద్యం వ్యాపారిగా గుర్తింపు పొందిన డిఎన్‌సి వెంకన్న  (DNC Venkanna) అనారోగ్యంతో ఈరోజు కన్నుమూశారు. ఇటీవలే ఆయన కుమారుడి వివాహం రెండు రోజుల క్రితమే ఘనంగా నిర్వహించబడగా, ఈ అకస్మాత్తు మరణం కుటుంబ సభ్యులు, స్నేహితులను తీవ్ర విషాదంలో ముంచేసింది.


అలాగే మణుగూరులో గిన్నెల వ్యాపారంతో అందరికీ సుపరిచితులైన బేతంచెర్ల కోటయ్య  కూడా కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులు బేతంచెర్ల వెంకటేశ్వర్లు మరియు బేతంచెర్ల శ్రీనివాస్ ఉన్నారు. వ్యాపార రంగంలో నిజాయితీతో, సరళ స్వభావంతో కోటయ్య  ప్రజల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించారు.


ఇంకా మణుగూరులో జెమినీ జ్యూవెలరీ బంగారు షాపు ఎదురుగా మొదటిసారిగా దంచాయ్ (టీ) ను ప్రజలకు పరిచయం చేసిన వ్యక్తిగా పేరుగాంచిన కొండ్రు సీతారామయ్య  కూడా మరణించడం మరో విషాదంగా మారింది. మణుగూరు ప్రజలకు ప్రత్యేకమైన దంచాయ్ రుచిని పరిచయం చేసి మంచి గుర్తింపు పొందారు. ఆయనకు ముగ్గురు కుమారులు అశోక్, గౌతమ్, కిరణ్ ఉన్నారు.


మణుగూరులో వ్యాపార రంగంలో తమదైన ముద్ర వేసిన ఈ ముగ్గురు వ్యక్తుల మరణం పట్టణ ప్రజలను, వ్యాపార వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. వారి సేవలను, స్నేహపూర్వక స్వభావాన్ని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని పలువురు పేర్కొన్నారు.


మణుగూరు ప్రజలు, వ్యాపారస్తులు ఈ ముగ్గురు ప్రముఖుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Post a Comment

కొత్తది పాతది