గుడ్ న్యూస్... 4 పథకాలు ప్రారంభించేందుకు అన్నీ సిద్ధం

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

 తెలంగాణ సర్కార్ ఈనెల 26న నాలుగు పథకాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా పథకాలకు ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల అర్హుల జాబితాను అధికారులు రూపొందించారు. అయితే అందులో అర్హులైన చాలా మంది పేర్లు లేవని ప్రజలు అంటున్నారు. అన్ని అర్హతలు ఉన్నా.. లిస్టులో పేర్లు లేవని ఆందోళన చెందుతున్నారు. దీంతో మంత్రులు క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని.. లిస్టులో పేర్లు లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. గ్రామసభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఈ మేరకు నేటి నుంచి ఈనెల 24న వరకు గ్రామసభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు సీఎస్ శాంతి కుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు. కొత్త రేషన్‌ కార్డుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 11,65,052 మందికి సంబంధించిన 6,68,309 కార్డుల సమాచారాన్ని సిద్ధం చేసినట్లు చెప్పారు. మరో 1.36 కోట్ల మందికి సంబంధించిన 41.25 లక్షల కార్డుల సమాచారాన్ని అవసరాన్ని బట్టి తెలియజేస్తామన్నారు. దీంతోపాటుగా నేటి నుంచి జరిగే గ్రామసభల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకోవాలన్నారు.

 కుటుంబ పెద్ద, ఇతర సభ్యుల ఆధార్‌ కార్డులు, అడ్రస్, ఫోన్ నంబర్, కులానికి సంబంధించిన వివరాలు అందులో నమోదు చేయాలని సూచించారు. నేటి నుంచి జరిగే గ్రామసభల్లో కొత్త రేషన్‌ కార్డుల జారీకి అధికారులు జాబితాను రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ లిస్టులో పేరు లేనివారు రేషన్‌ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం దరఖాస్తు పత్రాన్ని రూపొందించిందని సీఎస్ చెప్పారు. గ్రామసభలో ఈ పత్రాన్ని నింపి అధికారులకు అందజేస్తే.. పరిశీలించి అర్హులకు రేషన్‌ కార్డులను అందించనున్నట్లు వెల్లడించారు. అందుకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు తమ వద్ద ఉంచుకోవాలన్నారు.

Post a Comment

కొత్తది పాతది