మేడారం అడవుల్లో చెట్లు కూలిపోవడానికి, ఇప్పుడు భూకంపానికి సంబంధం ఉందా?

 


తెలంగాణలోని ములుగు జిల్లా మేడారం కేంద్రంగా బుధవారం ఉదయం భూకంపం సంభవించింది.

7:27 గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం రాగా, భూమి లోపల దాదాపు 40 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకటించింది.

హైదరాబాద్ నగరానికి 219 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉంది.

భూకంప ప్రభావంతో ములుగు, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హన్మకొండ, వరంగల్, విజయవాడ, నందిగామ సహా చాలా ప్రాంతాల్లో భూమి కంపించింది.

హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి.

అప్పుడు జరిగిన విధ్వంసానికి, ఇప్పుడు వచ్చిన భూకంపానికి ఏదైనా సంబంధం ఉందా? ఏపీ, తెలంగాణలో ఈ స్థాయిలో భూకంపం రావడానికి కారణం ఏమిటి? గతంలో ఈ స్థాయిలో భూకంపం ఎప్పుడు వచ్చింది? దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

అడవిలో ఏం జరిగింది? భూకంపానికి సంబంధం ఉందా?

ములుగు జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతంలో ఆగస్టు 31న ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో 80 వేలకు పైగా చెట్లు నేలకూలినట్లుగా అటవీ శాఖ అధికారులు అంచనా వేశారు.

తాజా భూకంప కేంద్రం ములుగుకు సమీపంలోని మేడారంలో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ గుర్తించింది.

అప్పుడు జరిగిన విధ్వంసానికి, ఇప్పుడు వచ్చిన భూకంపానికి సంబంధం ఉందని చెప్పడం సరికాదని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్ దవులూరి శ్రీనగేశ్ చెప్పారు.


తుపాను లేదా భారీ వర్షాలు వాతావరణంపై ఆధారపడి ఉంటాయి. భూ ప్రకంపనలు అనేవి భూమిలోపల కొన్ని వందల కిలోమీటర్ల నుంచి వచ్చే కన్విక్షన్ కరెంట్స్ కారణంగా ఏర్పడతాయి. ఈ రెండూ పూర్తిగా విరుద్ధమైనవి. ఒక శాస్త్రీయ నిర్ధరణ లేకుండా అప్పట్లో వేల చెట్లు కూలడానికి.. ఇప్పుడు వచ్చిన భూకంపానికి సంబంధం ఉందని చెప్పలేం. ఈ రెండు ఘటనల మధ్య మూడు నెలల వ్యత్యాసం ఉంది.

ఇప్పుడు భూకంప కేంద్రం 40 కిలోమీటర్ల లోతులో ఉంది. అప్పట్లో వర్ష ప్రభావం అనేది భూమికి 5 కిలోమీటర్లపై ఎత్తులో వచ్చింది. రెండింటినీ పోల్చుకుంటూ అప్పటి విధ్వంసం వల్లే ఇది వచ్చిందని చెప్పడానికి లేదు’’ అని చెప్పారాయన.

హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలోని ఎర్త్‌క్వేక్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ రామంచర్ల కూడా ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

‘‘అప్పుడు చెట్లు కూలిపోవడం, ఇప్పుడు భూకంపం రావడం అనేది పూర్తిగా యాదృచ్ఛికం. ఈ రెండింటినీ పోల్చలేం’’ అని ప్రొఫెసర్ ప్రదీప్ చెప్పారు.



ములుగులో వస్తే విజయవాడలో ప్రకంపనలు ఎందుకు?

ఎక్కడో ములుగు జిల్లాలోని మేడారంలో భూకంపం వస్తే ఆ ప్రకంపనలు మేడారం నుంచి సుమారు 280 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ వరకు విస్తరించాయి.

మరోవైపు మేడారం నుంచి సుమారు 230 కిలోమీటర్ల దూరంలోని రాజమండ్రిలోనూ ప్రకంపనలు వచ్చినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

అంత దూరం వరకు ప్రకంపనలు ఎందుకు వచ్చాయని పరిశీలిస్తే.. ‘భూమిలో 40 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉండటంతో ఆ ప్రభావం (కోన్ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్) చాలా దూరం వరకు ఉంటుంది.

ఇక్కడి భూమి లోపల రాతి ప్రదేశం ఎక్కువగా ఉంది. దానివల్ల భూకంప తరంగాలు చాలా వేగంగా ప్రయాణించే వీలుంటుంది. అందుకే చాలా ప్రాంతాల్లో భూమి ఎంతో కొంత కంపించింది’’ అని శ్రీనగేశ్ చెప్పారు.

Post a Comment

أحدث أقدم