మణుగూరు గురుకుల హాస్టల్‌పై ఆకస్మిక తనిఖీలు… విద్యార్థుల భోజనంపై ప్రత్యేక దృష్టి

 


EB NEWS/మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు రాజీవ్ గాంధీ నగర్‌లోని మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల బాలుర పాఠశాలలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇటీవల జిల్లాలో కొన్ని చోట్ల ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో జిల్లా అధికారులు హాస్టళ్లను నిరంతరం తనిఖీ చేయాలని మండల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.


ఈ క్రమంలో తహసీల్దార్ అద్దంకి నరేష్, డీటీ రామారావు, ఆర్‌ఐ గోపి కలిసి గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. హాస్టల్ వంటగది, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు.


ఈ సందర్భంగా తహసీల్దార్ అద్దంకి నరేష్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించేందుకు హాస్టల్ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఆహార పదార్థాల నిల్వ, వంట ప్రక్రియలో పరిశుభ్రత పాటించడంతో పాటు విద్యార్థుల ఆరోగ్యంపై ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు.


విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, భవిష్యత్తులో కూడా హాస్టళ్లపై ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.


Post a Comment

కొత్తది పాతది