EB NEWS /భద్రాచలం:
వివిధ ఆదివాసి గిరిజన గ్రామాల నుంచి వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తెలిపారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో గిరిజన దర్బార్ ప్రారంభానికి ముందు యూనిట్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఆయన, అనంతరం గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజనులు సమర్పించిన అర్జీలలో పోడు భూముల సమస్యలు, పట్టాల మంజూరు, పేర్ల మార్పులు, వ్యక్తిగత రుణాలు, వ్యవసాయ భూములకు విద్యుత్ మోటార్లు, గ్రామాలకు విద్యుత్ సౌకర్యం, సోలార్ కనెక్షన్లు, బోర్లు తవ్వేందుకు అనుమతులు, ఇసుక మరియు మత్స్య సొసైటీలు ఏర్పాటు, వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్లు, వృత్తి శిక్షణలు, దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు ఆర్థిక సహాయం వంటి వివిధ అంశాలు ఉన్నాయని తెలిపారు.
గిరిజన దర్బార్‌లో వచ్చిన అన్ని అర్జీలను ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేసి, ఆన్లైన్‌లో నమోదు చేయించి, విడతలవారీగా సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి అశోక్, ఏడీఎంహెచ్ఓ సైదులు, ఈఈ మధుకర్, ఏవో రాంబాబు, ఉద్యానవనాధికారి ఉదయ్ కుమార్, డిటీఆర్‌ఓఎఫ్‌ఆర్ లక్ష్మీనారాయణ, డిటీఎల్టీఆర్ నాగేశ్వరరావు, మేనేజర్ ఆదినారాయణ, ఐసిడీఎస్ సిడిపిఓ జ్యోతి, ఏవో నరేందర్, హెచ్ఈఓ లింగ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి