బంగారు గాజులు, క్యాష్ దొంగతనం చేసారు.. ఆ తర్వాత



EB NEWS/ఖమ్మం:


ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో నాగులవంచలో జరిగిన చోరీ కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. చోరీ జరిగిన 24 గంటలు కూడా గడవక ముందే వైరా సీఐ వెంకటేశ్వర్లు నిందితులను అదుపులోకి తీసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


వివరాల ప్రకారం గురువారం ఉదయం ఆటోలో వచ్చిన ఇద్దరు దొంగలు నాగులవంచ గ్రామంలో రైతు ఆలస్యం శ్రీనివాసరావు ఇంటిని లక్ష్యంగా చేసుకున్నారు. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన వారు తలుపును తన్ని పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న నాలుగు బంగారు గాజులు (సుమారు 90 గ్రాములు), ఒక ఉంగరం మరియు ₹14,500 నగదును దోచుకుని పరారయ్యారు.


చోరీ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే వైరా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజ్‌లు, స్థానిక సమాచారం ఆధారంగా కేవలం 24 గంటల లోపే నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన నగదులో సుమారు ₹2,500 ఖర్చు చేయగా, మిగిలిన ₹12,000 నగదును పోలీసులు రికవరీ చేసినట్లు సమాచారం.


నిందితుల్లో ఒకరు ముదిగొండ మండలం ముత్తారం గ్రామానికి చెందినవాడిగా, మరొకరు చింతకాని మండలం లచ్చగూడెం గ్రామానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.


చోరీ జరిగిన కొన్ని గంటల్లోనే కేసును ఛేదించి నిందితులను పట్టుకోవడంలో వైరా సీఐ వెంకటేశ్వర్లు చూపిన చాకచక్యంపై స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. విధుల పట్ల ఆయన చూపుతున్న కట్టుబాటును పలువురు అభినందిస్తున్నారు. త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.

   


Post a Comment

కొత్తది పాతది