EB NEWS/అశ్వాపురం:
అశ్వాపురం మండలంలో మానవత్వం మళ్లీ వెలుగొందింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ చిన్నారికి సహాయం చేసేందుకు అధికారులు, గ్రామస్తులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి ముందుకు వచ్చి అండగా నిలిచారు.
మండల పరిధిలోని అమ్మగారిపల్లి గ్రామపంచాయతీకి చెందిన కుమ్మరిగూడెం గ్రామానికి చెందిన రూత్విక్ (2) ఊపిరితిత్తుల సమస్యతో తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. చిన్నారి తల్లిదండ్రులకు వైద్య ఖర్చులు భరించే ఆర్థిక స్థోమత లేక తీవ్ర ఆందోళనలో ఉండగా, దాతల సహాయం కోసం విజ్ఞప్తి చేశారు.
ఈ విషయం తెలుసుకున్న అమ్మగారిపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి ఎస్‌కే అజార్ ప్రత్యేక చొరవ తీసుకొని చిన్నారి పరిస్థితిని దాతలకు వివరించి విరాళాలు సేకరించారు. జనం కోసం మనం స్వచ్ఛంద సంస్థ నుంచి రూ.20,000, అశ్వాపురం మండల అధికారులు, సిబ్బంది మరియు పినపాక గ్రామస్తుల నుంచి సేకరించిన రూ.22,000తో కలిపి మొత్తం రూ.42,000 ఆర్థిక సహాయాన్ని ఖమ్మంలోని అంకుర్ ఆస్పత్రిలో చిన్నారి కుటుంబానికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ యూడీసీ పద్మావతి, అమ్మగారిపల్లి సర్పంచ్ ఇర్ఫా కవిత, పంచాయతీ కార్యదర్శులు వేణుప్రియ, ఎస్‌కే అజార్, దొడ్డ శరత్, జనం కోసం మనం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు రోహిత్, ఎస్‌కే అజార్, ఎస్‌కే అంకుష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని అందరూ ఆకాంక్షించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి