ఇందిరమ్మ ఇళ్లకు మళ్లీ ఊపిరి – నిర్మాణం పూర్తి చేయని లబ్ధిదారులకు సాయం
EB NEWS/ హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త ప్రకటించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంజూరైనప్పటికీ వివిధ కారణాలతో నిర్మాణం పూర్తి కాలేకపోయిన ఇళ్లను పూర్తిచేయడానికి ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
2009లో అప్పటి ప్రభుత్వం అమలు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకం రాష్ట్రాన్ని గుడిసెలు లేని రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో ప్రారంభించబడింది. అయితే ప్రభుత్వ మార్పులు, నిధుల కొరత తదితర కారణాల వల్ల కొంతమంది లబ్ధిదారుల ఇళ్లు బేస్మెంట్ దశలోనే నిలిచిపోయాయి.
ఇలాంటి లబ్ధిదారులు సుమారు 9 వేల మంది వరకు ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదికలు అందాయి. ఇప్పటికే బేస్మెంట్ నిర్మాణానికి ఖర్చైన సుమారు రూ.1 లక్షను మినహాయించి, మిగిలిన నిర్మాణం పూర్తి చేసుకునేందుకు ప్రతి లబ్ధిదారునికి గరిష్టంగా రూ.4 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు.
ఈ నిర్ణయంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఊరట లభించనుంది. అమలు విధానం, అర్హత ప్రమాణాలపై త్వరలోనే ప్రభుత్వం స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి