నాలుగు అక్షరాల కోసం పోరాటం... హృదయాలను కదిలిస్తోంది...!

 


లస ఆదివాసీ పిల్లలు పాఠశాలకు చేరుకోవడానికి రోజూ 2 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


అశ్వాపురం మండలం చింతకుంట గ్రామంలో చదువే భవిష్యత్తు అనుకుంటున్న చిన్నారులకు నడకే పెద్ద పరీక్షగా మారింది. వలస ఆదివాసీ కుటుంబాలకు చెందిన పిల్లలు పాఠశాలకు చేరుకోవాలంటే రోజూ రెండు కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది.

చిన్నపిల్లలకు నడకే భారంగా మారుతుండగా, దానికి తోడు పుస్తకాల బరువు మోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి వారిని నరకయాతనకు గురిచేస్తోంది. వర్షం, ఎండ, చలి అనే తేడా లేకుండా చదువుకోసం రోజూ ఈ కష్టాన్ని భరిస్తున్నారు. నాలుగు అక్షరాల చదువు కోసం వారు పడుతున్న తపన హృదయాన్ని కదిలిస్తోంది.

పిల్లల భద్రత దృష్ట్యా, రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల చదువుపై ప్రతికూల ప్రభావం పడుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “చదువుతోనే మా పిల్లల భవిష్యత్తు మారుతుందని ఆశిస్తున్నాం. కానీ బడికి వెళ్లడమే ఇంత కష్టమైతే ఎలా చదువుకుంటారు?” అని వారు ప్రశ్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పాలకులు, అధికారులు తక్షణమే స్పందించి పిల్లలకు పాఠశాల వాహన సదుపాయం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు. చిన్నారులకు సురక్షితమైన రవాణా కల్పిస్తే చదువు మధ్యలో ఆగిపోకుండా, వారు నిర్భయంగా బడికి వెళ్లి మంచి భవిష్యత్తు నిర్మించుకునే అవకాశం కలుగుతుందని ఆశిస్తున్నారు.

Post a Comment

కొత్తది పాతది