ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తిరిగి క్రియాశీలక పాత్ర పోషించనుందని, రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ తెలంగాణలో కచ్చితంగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాష్ట్రానికి చెందినది కాదని, తెలుగు జాతి సమగ్ర వికాసాన్ని ధ్యేయంగా పెట్టుకుని.. తెలుగువారు ఎక్కడ ఉన్నా వారిని బలోపేతం చేయాలనే ఆశయంతో స్థాపించబడిందని ఆయన పునరుద్ఘాటించారు.
ఇది తెలంగాణలోని టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపగా.. రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై ఈ ప్రకటన ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న చర్చ మొదలైంది.
చంద్రబాబు నాయుడు తన వ్యాఖ్యలలో తెలుగుదేశం పార్టీ స్థాపన వెనుక ఉన్న ప్రాథమిక సిద్ధాంతాన్ని గుర్తు చేశారు.
పార్టీని స్థాపించినప్పుడు ‘తెలుగు జాతి అభివృద్ధి’ అనే నినాదంతో ముందుకు వచ్చామని, తెలుగువారు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా.. వారి ఆత్మగౌరవాన్ని, అభివృద్ధిని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని వివరించారు.
‘తెలుగుదేశం పార్టీ పెట్టేందే తెలంగాణలో’ అని ఆయన పేర్కొనడం, ఆ పార్టీకి తెలంగాణతో ఉన్న చారిత్రక బంధాన్ని తెలియజేస్తుంది.
రాష్ట్ర విభజన తర్వాత తాత్కాలికంగా ఎదురైన కొన్ని సమస్యల వల్ల తెలంగాణలో పార్టీ బలహీనపడిందని అంగీకరించినప్పటికీ.. వాటిని అధిగమించి ముందుకు సాగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అండమాన్ వంటి చిన్న ప్రాంతాలలో కూడా తమ పార్టీ మున్సిపల్ చైర్మన్‌ను గెలిపించిందని.. ఇది ఇతర రాష్ట్రాలలో విస్తరణకు ఉన్న అవకాశాలకు నిదర్శనమని చంద్రబాబు నాయుడు ఉదాహరించారు.
పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించే ఆలోచన మొన్నటివరకు లేదని.. కానీ ఇప్పుడు పరిస్థితులను బట్టి పార్టీని విస్తరిస్తామని తెలిపారు.
2041 నాటికి తెలుగు జాతి ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో ఉండాలనేదే తన ధ్యేయమని చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.
ఈ లక్ష్య సాధనకు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలంగా ఉండటం కూడా ముఖ్యమని ఆయన పరోక్షంగా సూచించారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి