ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
సివిల్స్ ఫలితాలు ఇటీవలే విడుదల అయ్యాయి. చాలా మందికి సివిల్స్ లో ర్యాంక్ కొట్టాలని ఆశగా ఉంటుంది. ఇందుకోసం కఠోర సాధన చేయాలి. అలా సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి ఎలాంటి ఖరీదైన కోచింగ్ తీసుకోకుండా మొబైల్ కు కూడా దూరంగా ఉంటూ సివిల్స్ పరీక్షలో జాతీయ స్థాయిలో అద్భుతమైన విజయం సాధించింది ఓరుగల్లు బిడ్డ.
తన పేరే ఇట్టబోయిన సాయి శివాని. తను ఆల్ ఇండియా స్థాయిలో 11వ ర్యాంక్ సాధించడమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో టాపర్‌గా నిలిచి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. నిరుపేద కుటుంబంలో పుట్టి పట్టుదలతో సొంత ప్రిపరేషన్‌తో ఈ ఘనత సాధించిన సాయి శివాని ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.
వరంగల్ లోని శివనగర్‌కు చెందిన ఇట్టబోయిన రాజ్ కుమార్ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తుంటారు. ఆయన భార్య రజిత గృహిణి. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.వీరి పెద్ద కుమార్తె సాయి శివాని సివిల్స్‌లో 11వ ర్యాంక్ సాధించి తల్లిదండ్రుల కష్టానికి తగ్గ ఫలితాన్ని చూపించింది. కడప ట్రిపుల్ ఐటీలో పీయూసీ, ఆ తర్వాత 2022లో బీటెక్ పూర్తి చేసిన సాయి శివాని, తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి ఎలాగైన ఐఏఎస్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూనే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షలకు కూడా సిద్ధమై రాష్ట్ర స్థాయిలో 21వ ర్యాంక్ సాధించింది.అయినా ఆమె దృష్టంతా ఐఏఎస్ లక్ష్యంపైనే ఉండడంతో మరింత కష్టపడింది. ఒకేసారి గ్రూప్ వన్, సివిల్స్ పరీక్షలు ఉన్నప్పటికీ రెండింటినీ సమర్థంగా బ్యాలెన్స్ చేసుకుంటూ చదివింది.
సివిల్స్ ర్యాంక్ సాధించాలన్న సంకల్పంతో ఉన్న సాయి శివానికి కోచింగ్ తీసుకునే స్థోమత లేదు. దీంతో ఆమె సొంతంగానే ప్రిపరేషన్ ప్రారంభించింది. ఆన్‌లైన్‌లో స్టడీ మెటీరియల్ సేకరించుకుని ఇంట్లోనే కష్టపడింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సాయి శివానికి సొంతంగా ఫోన్ కూడా లేదు. ఫోన్ ఉంటే సమయం వృధా అవుతుందనే ఉద్దేశంతో ఆమె ఫోన్‌ను ఉపయోగించలేదు. ట్రిపుల్ ఐటీలో చదువుకునే రోజుల్లో కాలేజీ ఫోన్‌లోనే తల్లిదండ్రులతో మాట్లాడేది. ఇప్పటికీ స్నేహితులతో మాట్లాడటానికి తండ్రి ఫోన్ మీదే ఆధారపడుతుంది. ఏకాగ్రతకు భంగం కలుగుతుందన్న కారణంతోనే కారణంతోనే ఫోన్ వాడలేదని ఆమె స్పష్టం చేసింది. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ కరెంట్ అఫైర్స్ కోసం వార్తాపత్రికలు, టీవీలను చూసి తెలుసుకున్నట్లు తెలిపింది. ఇలా ఎన్నో ఆటంకాలను అధిగమించి సాయి శివాని యూపీఎస్సీ పరీక్షలో అద్భుతమైన విజయం సాధించింది. ఆమె విజయం వరంగల్ వాసులకు గర్వకారణంగా మారింది. తమ కుమార్తె పడిన కష్టానికి తగిన ఫలితం దక్కడంతో తల్లిదండ్రులు రాజ్ కుమార్, రజిత ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి