అశ్వాపురం మండలం ఎన్ ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
=======================
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని తుమ్మల చెరువులో గురువారం నాడు బోటింగ్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పినపాక శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు ముఖ్య అతిథిగా హాజరై బోటింగ్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తుమ్మల చెరువు అనేది సుమారు 1500 ఎకరాల విస్తీర్ణం కలిగి, కాకతీయుల కాలంలో నిర్మించబడినదని తెలిపారు. ఈ చెరువు వల్ల కొన్ని వేల ఎకరాల పంటపొలాలకు సాగునీరు అందుతుందని, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ పర్యాటక కేంద్రం అభివృద్ధికి జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్ ప్రత్యేక చొరవ చూపి ప్రభుత్వ నిధుల రూపంలో 10 లక్షల రూపాయల మంజూరు చేయించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
డ్వాక్రా మహిళ సంఘాలకు ఈ కేంద్రం నిర్వహణ బాధ్యత అప్పగించడం ద్వారా వారు మరింత అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సూచించారు. పినపాక నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందని, ఐటీసీ, సింగరేణి, బారాజల కర్మాగారం, బీటీపీఎస్ వంటి ప్రముఖ పరిశ్రమలు ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నాయని అన్నారు.
ఈ పర్యాటక కేంద్రం సెలవు దినాలు మరియు పండుగ వేళల్లో ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించి సేద తీర్చుకోవడానికి ఉత్తమమైన కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య గారు,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు మరియు తదితరులు హాజరయ్యారు.

