పినపాక: రైతుల నోటికాడ అన్నాన్ని లక్కోబోతున్న నవోదయ విద్యాలయం ? రైతుల పరిస్థితి ఏంటి?

 



ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్;

పినపాకలో 126.07 గుంటల వ్యవసాయ భూమి నవోదయ స్కూల్ కోసం కేటాయింపు: ఆందోళనలో రైతులు* 

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోపాలరావుపేట శివారులోని సర్వే నెంబర్ 128లో బాపనయ్య కుంట పారకం కింద ఉన్న 126.07 గుంటల భూమిని *నవోదయ రెసిడెన్షియల్ స్కూల్* కోసం కేటాయించనున్నట్టు తహసీల్దార్ అద్దంకి నరేష్ తెలిపారు. ఈ భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, సర్వేయర్ నరేష్ తదితర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  


గత 60 సంవత్సరాలుగా ఈ భూమిలో దాదాపు 100 మంది రైతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనాధారాన్ని పొందుతున్నారు. ఇప్పుడు ఈ భూమిని అకస్మాత్తుగా ప్రభుత్వ భూమిగా ప్రకటించి, స్కూల్ నిర్మాణం కోసం తీసుకోవడంపై గ్రామస్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ, "నవోదయ స్కూల్ పినపాక మండలానికి రావడం నిజంగా హర్షించదగిన విషయం. కానీ, రైతుల భూములు లాక్కుని స్కూల్ నిర్మిస్తామని చెప్పడం మాకు అన్యాయంగా అనిపిస్తోంది. ఖాళీ స్థలం ఎక్కడా దొరకలేదా? మా జీవనాధారమైన పొలాలను తీసుకుంటే, మా బ్రతుకులు వీధిన పడతాయి. మాకు వేరే ప్రత్యామ్నాయం లేకుండా తయారవుతుంది,” అన్నారు.  


రైతులు ప్రశ్నించారు, "పొడు భూములకే ప్రభుత్వం పట్టాలు ఇస్తుంటే, మా పంట పొలాలకు పట్టాలు ఎందుకు ఇవ్వకూడదు? మా భూములను ప్రభుత్వ భూమిగా మార్చడాన్ని మేము ఒప్పుకోలేము. గ్రామంలో ఖాళీ స్థలంలో స్కూల్ నిర్మిస్తే మేము కూడా హర్షిస్తాం. కానీ మా పొలాలను తీసుకోవడం పూర్తిగా అన్యాయం."  


రైతులు వారి బాధను వివరించుతూ, "*ఈ భూములపై మా మూడు తరాలుగా ఆధారపడి జీవనం సాగిస్తున్నాము*. ఇప్పుడు ఈ భూములు లేకపోతే, మేము మరో చోట కొనుగోలు చేసుకునే సామర్థ్యం కూడా లేదు. కాబట్టి ప్రభుత్వం మరొకసారి ఆలోచించి మా భూముల జోలికి రాకుండా కాపాడాలి," అని విజ్ఞప్తి చేశారు.  


ఈ వ్యవహారం గ్రామ ప్రజలందరికీ ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి, రైతుల ఆకాంక్షలను గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని, రైతుల పంట భూములకు పట్టాలు ఇచ్చి వారి జీవన విధానాన్ని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.  




Post a Comment

కొత్తది పాతది