కరకగూడెం అడవుల్లో పులి ఆనవాళ్లు… గ్రామాలకు హెచ్చరిక

 భద్రాద్రి కొత్తగూడెం తాజా వార్తలు 


EB NEWS/ కరకగూడెం:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో పులి కదలికలు గుర్తించబడినట్లు సమాచారం. రఘునాథపాలెం, జానంపేట–పొట్లపల్లి పరిసర ప్రాంతాల వద్ద వ్యవసాయ భూముల సమీపంలో పులి సంచరించిన ఆనవాళ్లు కనిపించినట్లు స్థానికులు తెలిపారు.

పొలాల వద్ద అనుమానాస్పద కదలికలు, అరుపులు వినిపించడంతో గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అధికారులు అడవిలో పరిశీలనలు నిర్వహించి పాదముద్రలను గుర్తించినట్లు తెలిపారు.

పులి సంచారాన్ని గమనించేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. కీలక మార్గాల్లో నిఘా చర్యలు చేపట్టి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సమీప అటవీ ప్రాంతాల నుంచి పులి ఈ ప్రాంతానికి చేరి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

అటవీ అంచున ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు, గిరిజనులు, పశువుల కాపరులు ఒంటరిగా అడవిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాత్రి వేళల్లో బయటకు రావడం తగ్గించాలని హెచ్చరించారు.

పరిస్థితి అదుపులోనే ఉందని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు.


Telangana news

Bhadradri kothagudem news

Kothagudem news

Bhadradri District News

Post a Comment

కొత్తది పాతది