పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
మండలంలోని బొమ్మరాజు పల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంగళవారం ఎంఈఓ కొమరం నాగయ్య పునః ప్రారంభించారు. సుమారు 15 ఏళ్ల క్రితం విద్యార్థులు లేకపోవడంతో ఈ పాఠశాలను మూసివేసిన అధికారులు ఇక్కడ ఉన్న రెండు ఉపాధ్యాయ పోస్టులు వేరే చోటకి బదిలీ చేశారు. ఇటీవల కాలంలో గ్రామంలో ప్రాథమిక స్థాయి బడి ఈడు పిల్లల సంఖ్య పెరగడంతో గత రెండు మూడు ఏళ్లుగా గ్రామస్తులు తమ పాఠశాలను తిరిగి ప్రారంభించాలని పలు ప్రయత్నాలు చేశారు. ఇటీవల కొందరు మహిళలు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను కలిసి తమ సమస్యను విన్నవించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతితో గ్రామంలో పాఠశాలను తిరిగి ప్రారంభించినట్లు ఎంఈఓ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీడీవో సునీల్ కుమార్ మాట్లాడుతూ మహిళల ప్రయత్నాన్ని అభినందించారు. సుశిక్షితులైన ఉపాధ్యాయులతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందించడమే కాక ఉచిత పాఠ్య, నోట్ పుస్తకాలు, ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలను ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తోందన్నారు. అనవసరంగా డబ్బులు వెచ్చించి ప్రైవేటు పాఠశాలలకు విద్యార్థులను పంపవద్దని సూచించారు. ఇంకా ఎవరైనా గ్రామం నుంచి ప్రైవేట్ కి వెళుతుంటే వారందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు కృషి చేయాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు. అనంతరం గ్రామస్తులతో కలిసి శ్రమదానంతో పాఠశాల పరిసరాలను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో ఎం పి ఓ వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు రామిరెడ్డి, నరసింహారావు, సతీష్, శ్రీకాంత్, వీరభద్రం, మాజీ సర్పంచ్ మహేష్, సిఆర్పి గిరిబాబు, సీసీఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
إرسال تعليق