భద్రాద్రి, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
*వివిధ రంగాల్లో మార్గదర్శకంగా నిలుస్తున్న కలెక్టర్ జితేష్ వి. పాటిల్.*
*పాలనలో తనదైన శైలితో ఉత్తమంగా.. ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ.. ప్రజలకు సేవలు అందిస్తున్న జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఈనెల 16వ తేదీ నాటికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా స్పెషల్ స్టోరీ..*
2024 జూలై 16న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన నాటినుండి జిల్లా అభివృద్ధికి వినూత్న కార్యక్రమాలతో శ్రీకారం చుట్టారు. పేద ప్రజలకు విద్య, వైద్యం, సంక్షేమ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూనే.. ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా. పకడ్బందిగా సమర్థవంతమైన పాలనను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు అందిస్తున్నారు. జిల్లా పాలనా బాధ్యతలు స్వీకరించిన వెంటనే వ్యవసాయం, విద్య మరియు వైద్య వ్యవస్థలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.
**వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి - మునగ సాగుకు ప్రోత్సాహం.*
వ్యవసాయరంగం పై ప్రత్యేక దృష్టి సారించి రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కలెక్టర్ వివిధ మార్గాలను అన్వేషించారు. దీనిలో భాగంగా ప్రత్యేకంగా మునగ సాగుకు ప్రోత్సాహం ఇస్తూ అనేక మండలాల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మునగ సాగు ద్వారా తక్కువ పెట్టుబడి, అధిక ఆదాయాన్ని అందు కోవచ్చని రైతులకు తెలియజేస్తూ చైతన్యపరిచారు. మునగ సాగు వల్ల లాభాలు, మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన కల్పించి రైతులను అధికంగా అభివృద్ధి పరిచేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారు. రైతులు ఒకే పంటపై ఆధారపడకూడదని అంతర్ పంటల సాగు ద్వారా ఆర్థిక అభివృద్ధి చెందాలని తెలియజేస్తూ పెరటి కోళ్ల పెంపకం, తేనెటీగల పెంపకం, పుట్టగొడుగుల సాగు వంటి వాటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతులను చైతన్యవంతులని చేస్తున్నారు.
*చేపల పెంపకం తో మారుమూల గ్రామాల్లో వెలుగు.*
చేపల పెంపకాన్ని కేవలం చెరువులకే పరిమితం చేయకుండా, వ్యవసాయ క్షేత్రాల్లోని ఫామ్ పౌండ్లలో (farm ponds) చేపల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇది జిల్లా వ్యవసాయ విధానాల్లో సమగ్ర వ్యవసాయాన్ని (ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్) ప్రోత్సహించేందుకు తీసుకున్న వినూత్న నిర్ణయంగా నిలిచింది.
ప్రతి రైతు పొలం వద్ద ఏర్పాటు చేసిన నీటి సంరక్షణ గుంతలను కేవలం సాగునీటి ఉద్దేశానికే కాకుండా, చేపల పెంపకానికి ఉపయోగించాలనే ఆలోచనతో కలెక్టర్ కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. దీని ద్వారా రైతులకు అదనపు ఆదాయం, ఆహార భద్రత, మరియు వ్యవసాయ ఖర్చుల్లో తగ్గుదల వంటి ప్రయోజనాలు కలుగుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. వ్యవసాయ క్షేత్రాలలో అంతర్ పంటగా ఫామ్ పౌండ్ ఇళ్లలో చేపల పెంపకం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని పలు యూనిట్లను స్థాపించి నిరూపించారు.
*ప్రకృతి వ్యవసాయానికి నూతన చైతన్యం.*
జిల్లాలో ప్రకృతి వ్యవసాయానికి నూతన దిశను అందిస్తూ, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ స్వయంగా బయోచార్ తయారీని ఆచరణలో చూపించి రైతులకు ప్రేరణ ఇస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో మట్టికి పోషకాలు అందిస్తూ దిగుబడులు పెంచే బయోచార్ తయారీ పద్ధతులపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించి రైతులకు వివరించిన కలెక్టర్, ప్రకృతి వ్యవసాయాన్ని ఆశ్రయించి రైతులు ఆర్థికంగా ముందుకు సాగాలని దృఢ సంకల్పాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రకృతి పద్ధతులపై రైతుల్లో అవగాహన పెరిగేలా చర్యలు చేపట్టారు. జిల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా ఇది కీలకంగా మారుతోంది. సహజ వనరుల వాడకంతో పాటు వ్యయాన్ని తగ్గించడంలో బయోచార్ కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.
**ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ*
జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకోవడానికి కలెక్టర్ స్వయంగా రాత్రి బస మరియు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి తానే స్వయంగా ప్రతి పాఠశాలలో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కారానికి కావలసిన ప్రణాళికలను రూపొందించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో విద్యను అభ్యసించేందుకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు. విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించడానికి గాను జిల్లాలో మూడు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మంజూరు చేయడం లో కీలక పాత్ర పోషించారు.
*గిరిజన జిల్లాలో ఆరోగ్య రంగాన్ని మరింత మెరుగుపరిచే దిశగా అడుగులు.*
మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు సమగ్ర వైద్యం అందించేందుకు జిల్లా కలెక్టర్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ, అందుబాటులో ఉన్న వసతులపై సమీక్షలు చేపడుతున్నారు. వైద్య సేవల నాణ్యత మెరుగుపరచే దిశగా అవసరమైన ఆధునిక వైద్య పరికరాల సమకూర్పుపై దృష్టి సారించారు.
అత్యాధునిక సాంకేతిక పరికరాలు, డయాగ్నస్టిక్ సదుపాయాలు, వంద పడకల ఆసుపత్రుల నిర్మాణాలకు అనుమతులు,అత్యవసర వైద్యం కోసం అవసరమైన వాహనాలు వంటి సదుపాయాలను ఆసుపత్రులకు అందించేలా చర్యలు చేపట్టారు.ప్రతి ఒక్క రోగికి సరైన సేవలు అందేలా వైద్య సిబ్బందికి మార్గనిర్దేశం చేసి, పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేశారు.
జిల్లాలో ఆరోగ్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు కలెక్టర్ చూపుతున్న చొరవ గిరిజనులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణను అందించేందుకు దోహదపడుతోంది.
*పర్యావరణ పరిరక్షణ - ఔషధ మొక్కలపై ప్రజలకు అవగాహన.*
పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యాచరణలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ కళాశాలల్లో ఔషధ గుణాలు కలిగిన మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో తులసి, రణపాల, వెలగ, ఉసిరి వంటి ప్రజలకు ఉపయోగకరమైన మొక్కలు నాటేందుకు ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణతో పాటు విద్యార్థులు, చిన్నారులకు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించేందుకే ఈ చర్యలు తీసుకున్నారు.
ప్రతి విద్యాసంస్థలో క్రమంగా మొక్కలు నాటి, వాటి సంరక్షణకు విద్యార్థులను భాగస్వాములను చేయాలన్నది కలెక్టర్ ఉద్దేశం.విద్యార్థులకు ఔషధ మొక్కల గురించి అవగాహన కల్పించేందుకు గాను పాఠశాలల్లో సీడ్ బ్యాంకులను ఏర్పాటు చేసి విత్తనాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగానే జిల్లావ్యాప్తంగా వనమహోత్సవంలో పెద్ద ఎత్తున ప్రజలకు ఉపయోగపడే మొక్కలను మాత్రమే నాటటానికి సిద్ధం చేస్తున్నారు. దీనివల్ల విద్యార్థుల్లో ప్రకృతి పట్ల ఆసక్తి పెరిగి, ఆచరణాత్మకంగా ప్రకృతి పరిరక్షణ పట్ల చొరవ పెరుగుతుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యభద్రతకు కూడా ఒక శుభ సంకేతంగా నిలుస్తుందని జిల్లా ప్రజలు అభినందిస్తున్నారు.
*జాతీయ గుర్తింపు దిశగా జిల్లా.*
జిల్లాలో భౌగోళిక శాస్త్రం పై ఉన్న ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని ప్రపంచంలోనే మూడవ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ జిల్లా భద్రాద్రి జిల్లాకు మంజూరు కావడం లో ఆయన తీసుకున్న చొరవ ప్రశంసనీయమైనది.ఇది భవిష్యత్తులో విద్యార్థులకు ప్రపంచ స్థాయిలో అవకాశాలు అందించేలా మారనున్నది.
*ఇంకుడు గుంతల ఉద్యమం - దేశం మొత్తం జిల్లా వైపు చూసేలా చేసింది.*
కేవలం ఆదేశాలిచ్చే స్థాయిలో పరిమితం కాకుండా జిల్లా కలెక్టర్ స్వయంగా పలుగు పట్టి, మట్టి మోసి, ప్రజల మధ్య పనిచేయడం ద్వారా ఒక ఉదాహరణగా నిలిచారు.
అధికారులే కాదు, ప్రజలందరూ కలెక్టర్ ఆదర్శాన్ని అనుసరించి, పెద్ద ఎత్తున ఇంకుడు గుంతల నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఈ ఉద్యమం గ్రామీణ ప్రాంతాల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించే దిశగా పటిష్టమైన అడుగులు వేసింది.
ఈ ప్రజాప్రేరిత ఉద్యమం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. భద్రాద్రి జిల్లా ఇంకుడు గుంతల నిర్మాణంలో *భద్రాద్రి మోడల్* గా నిలిచింది.
*పేదలకే ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలితం.*
పేదల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి అందేలా ప్రత్యేక కృషి చేశారు. ఆయన పర్యవేక్షణలో అన్ని సంక్షేమ పథకాల అమలు పారదర్శకంగా కొనసాగి, పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరేలా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటుచేశారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయివరకు తనిఖీలు నిర్వహిస్తూ, పథకాల అమలు పురోగతిని స్వయంగా సమీక్షించారు. అన్ని పథకాల్లో అక్రమ లబ్ధిదారులను తొలగించి, అర్హులైన పేదల వివరాలను అప్‌డేట్ చేయడం ద్వారా వాస్తవంగా అవసరమైన వారికి మేలు చేకూరేలా చేశారు.
ప్రతి ఒక్క పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టిన కలెక్టర్ , అధికారులతో నిరంతర పర్యవేక్షణ చేస్తూ సంక్షేమ పథకాల ఫలాలను నిస్వార్థంగా ప్రజలకు అందించారు. ఈ చర్యల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో వాస్తవమైన మార్పులు తీసుకురావడంలో ముఖ్యపాత్ర పోషించారు.
*జిల్లాలో మట్టి ఇటుకలతో ప్రహరీ గోడల నిర్మాణం ప్రారంభం* .
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధిలో మరో వినూత్న అధ్యాయం ప్రారంభమైంది. పర్యావరణహితం మరియు తక్కువ వ్యయంతో నిర్మాణాలు చేపట్టే దిశగా జిల్లాలో ప్రయోగాత్మకంగా మట్టి నుండి ఇటుకలు తయారీ చేపట్టారు. ఈ ఇటుకలను వినియోగించి కొన్ని ప్రహరీ గోడల నిర్మాణం విజయవంతంగా పూర్తి చేశారు.
ఈ ప్రాజెక్టు తొలి దశ విజయవంతం కావడంతో, రానున్న సంవత్సరంలో జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు మట్టి ఇటుకలతో ప్రహరీ గోడల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. దీనివల్ల నిర్మాణ వ్యయం తగ్గుతుండగా, స్థానిక వనరులను వినియోగించడం ద్వారా ప్రజలకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి.
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముందుచూపుతో చేపట్టిన ఈ కార్యక్రమం పాఠశాలల భద్రత, సౌందర్యానికి తోడ్పడడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు ఉదాహరణగా నిలుస్తోంది.
ఈ విధంగా, ప్రభుత్వ వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ, స్థానిక స్థాయిలో లభ్యమయ్యే మట్టిని సద్వినియోగం చేస్తూ, కొత్త తరం నిర్మాణాలకు మార్గం వేస్తూ జిల్లా మరో ముందడుగు వేసింది.
*గిరిజన సంస్కృతి చాటిన "ఏరు ఫెస్టివల్* "
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆధ్వర్యంలో గిరిజనుల ఆచార వ్యవహారాలు, సాంస్కృతిక విలువలు ప్రపంచానికి పరిచయం చేసే విధంగా "ఏరు ఫెస్టివల్" ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా గిరిజన తెగల జీవన విధానాన్ని, పాటలు, నృత్యాలు, హస్త కళలు, సంప్రదాయ వంటకాలను ప్రదర్శించే అవకాశం లభించింది.
ఈ వేడుకలో స్థానిక గిరిజనులు తమ పరంపరాగత దుస్తుల్లో పాల్గొని, తమ ఆరాధ్య దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, సాంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు. పర్యాటకులను ఆకర్షించేలా స్టాల్స్, ప్రదర్శన మండపాలు ఏర్పాటు చేయడం ద్వారా గిరిజన జీవన శైలి పై విశేష అవగాహన కలిగించారు.
కలెక్టర్ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని, గిరిజనుల విలువైన ఆచారాలను విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో ఈ ఉత్సవాన్ని నిర్వహించడం అభినందనీయం. జిల్లా స్థాయి నుండి జాతీయ స్థాయికి గిరిజన సంప్రదాయాలను తీసుకెళ్లే దిశగా ఇది ఒక ముందడుగుగా నిలిచింది.
జిల్లా అభివృద్ధే లక్ష్యంగా నిరంతరంగా పని చేస్తూ, ప్రజల సమస్యలను అర్థం చేసుకొని వాటికి తక్షణమే పరిష్కారం చూపే విధంగా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ విశేషంగా కృషి చేస్తున్నారు. ప్రతిరోజూ 24 గంటలూ అందుబాటులో ఉంటూ, అత్యవసరాలపై తక్షణ స్పందన, అధికార యంత్రాంగం పట్ల సమన్వయం, ప్రజల బాగుపై ప్రత్యేక శ్రద్ధను చూపుతున్నారు.
ప్రభుత్వ పథకాల అమలులో పకడ్బందీ పర్యవేక్షణతో పాటు, ప్రతి శాఖ పనితీరును నిరంతరం సమీక్షిస్తూ జిల్లా అభివృద్ధిని నడిపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రజల అభ్యర్థనలపై స్పందిస్తూ వారికి ప్రభుత్వం అందిస్తున్న సేవలు నేరుగా అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ విధంగా ప్రజల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా శ్రమిస్తున్న కలెక్టర్ ప్రజల మన్ననలు పొందుతున్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి